‘ప్రాణభయంతో పరుగులు’.. వణుకుతూ వివరించిన ‘ఏంజెల్’ | Holidaymakers describe horror of missile strikes | Sakshi
Sakshi News home page

‘ప్రాణభయంతో పరుగులు’.. వణుకుతూ వివరించిన ‘ఏంజెల్’

Mar 2 2026 9:22 AM | Updated on Mar 2 2026 9:42 AM

Holidaymakers describe horror of missile strikes

దుబాయ్: ‘అది ఒక పీడకల.. కళ్లముందే క్షిపణులు పేలుతుంటే ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో బేస్‌మెంట్‌కు పరుగులు తీశాం’ అంటూ బ్రిటన్ పర్యాటకురాలు జేడ్ ఏంజెల్ బీన్స్ తన భయానక అనుభవాన్ని వివరించారు. దుబాయ్‌లోని విలాసవంతమైన 'రిక్సోస్ ది పామ్' హోటల్‌లో బస చేస్తున్న ఆమెకు ఆదివారం ఉదయం వినిపించిన సైరన్ల మోత దడపుట్టించింది. వరుస పేలుళ్ల ధాటికి హోటల్ గదులు కంపించాయని, తోటి పర్యాటకులు భయంతో వాంతులు చేసుకోవడం, స్పృహ తప్పి పడిపోవడం లాంటి దృశ్యాలు అక్కడ కనిపించాయని ఆమె కన్నీటి పర్యంతమవుతూ మీడియాకు తెలిపారు.

ఇరాన్ క్షిపణుల దాడులతో పర్యాటక స్వర్గధామం దుబాయ్ ఒక్కసారిగా వణికిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ చర్యలకు ప్రతిగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను గాలిలోనే అడ్డుకుంటున్న తరుణంలో సంభవిస్తున్న భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లిపోతోంది. అత్యంత సురక్షితమైన ప్రాంతాలుగా భావించే  ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు సైతం ఈ దాడుల ప్రభావానికి లోనవడంతో వేలాది మంది పర్యాటకులు హోటల్ బేస్‌మెంట్లలో తలదాచుకోవాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది.

దుబాయ్‌లోని మానవ నిర్మిత ద్వీపం ‘పామ్ జుమేరా’లో యుద్ధ భీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న ప్రఖ్యాత ‘ఫెయిర్‌మాంట్ ది పామ్’ హోటల్ క్షిపణి తాకిడికి గురికాగా, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘బుర్జ్ అల్ అరబ్’ సమీపంలో డ్రోన్ శిథిలాలు పడి అగ్నిప్రమాదం సంభవించింది. బిల్లింగ్‌హేకు చెందిన మిక్ బ్రోమెల్ అనే మరో పర్యాటకుడు మాట్లాడుతూ..  తాము ఉంటున్న హోటల్ వెనుక భాగంలోనే క్షిపణులు పేలడం చూశామని, ఇది ఏదో యుద్ధ సినిమా చూస్తున్నట్లుగా ఉందని, ప్రాణాలతో స్వదేశానికి చేరుకుంటే చాలని అనుకుంటున్నామన్నారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్, టెల్ అవీవ్, దోహా తదితర నగరాల్లో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ఇప్పటికే తమ పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేస్తూ.. అత్యవసరమైతే తప్ప యూఏఈ, కతార్, కువైట్ వంటి దేశాలకు వెళ్లవద్దని సూచించింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ అస్థిరతతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండగా, ప్రపంచ దేశాలు ఈ యుద్ధ పరిణామాలను ఆందోళనతో గమనిస్తున్నాయి.

ఇది  కూడా చదవండి: ‘మమ్మల్ని కెలకొద్దు’.. లెబనాన్ ప్రధాని సీరియస్‌ వార్నింగ్‌!

Advertisement
 
Advertisement
Advertisement