న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు భారతదేశంపై దాడులకు కుట్ర పన్నుతున్నారని, ఇందుకు బంగ్లాదేశ్‌ను కొత్త వేదికగా ఎంచుకున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన వీడియో రికార్డింగ్ కూడా నిఘావర్తాలకు అందిందని ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన కథనంలో పేర్కొంది.
అక్టోబర్ 30న పాకిస్తాన్‌లోని ఖైర్‌పూర్ తమేవాలిలో జరిగిన ర్యాలీలో సీనియర్ ఎల్‌ఈటీ కమాండర్ సైఫుల్లా సైఫ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆ వీడియోలో ‘హఫీజ్ సయీద్ ఖాళీగా కూర్చోలేదు.. అతను బంగ్లాదేశ్ మార్గంలో భారతదేశంపై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాడు’ అని సైఫుల్లా సైఫ్ స్పష్టంగా చెప్పాడు. లష్కర్ ఎ తోయిబా సభ్యులు ఇప్పటికే తూర్పు పాకిస్తాన్ (బంగ్లాదేశ్)లో చురుకుగా ఉన్నారని, భారతదేశానికి (ఆపరేషన్ సిందూర్‌కు ప్రతిగా) సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
కాగా సయీద్ ‘జిహాద్’ నెపంతో బంగ్లాదేశ్ యువతకు ఉగ్రవాద శిక్షణ అందించేందుకు ఆ దేశానికి సైఫుల్లా సైఫ్‌ను పంపాడు. ఈ శిక్షణ కార్యక్రమానికి పిల్లలు హాజరుకావడం విశేషం. కాగా ఒక వీడియోలో సైఫ్ పాకిస్తాన్ సైన్యాన్ని ప్రశంసించాడు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత వచ్చిన మార్పులను ప్రస్తావిస్తూ, ఇప్పుడు, అమెరికా మనతో ఉందని, బంగ్లాదేశ్ కూడా మళ్లీ పాకిస్తాన్‌కు దగ్గరవుతోందని వ్యాఖ్యానించాడు. ఈ వాదనలు కార్యక్రమానికి హాజరైన ధైర్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవిగా కనిపిస్తున్నాయి. కాగా బంగ్లాదేశ్- పాకిస్తాన్ దోస్తీతో ఏర్పడబోయే ముప్పుపై భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న చొరబాట్లపై నిఘాను తీవ్రతరం చేశాయి.
ఇది కూడా చదవండి: కాశ్మీర్‌లో కలకలం.. ఉగ్రవాదులతో వైద్యుల దోస్తీ?


