న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పోలీసులు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో పలు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కశ్మీర్ లోయలో ఒక వైద్యుని నుంచి పోలీసులు ఏకే-47 రైఫిల్‌తో పాటు కొంత మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న దరిమిలా అతనిని అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.
అరెస్టు అయిన వైద్యుడు వెల్లడించిన వివరాల ఆధారంగా జమ్ముకశ్మీర్ పోలీసులు ఫరీదాబాద్‌లో 300 కిలోల ఆర్‌డీఎక్స్, ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న ఆయనను.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేయడంలో, రవాణా చేయడంలో అతని ప్రమేయంపై ఉన్నతాధికారులు ప్రశ్నించారు. పోలీసులు ఆ వైద్యుడిని పుల్వామా జిల్లాలోని కోయిల్ నివాసి ముజామిల్ షకీల్‌గా గుర్తించారు. ఈ వ్యవహారంలో మరో వైద్యుని ప్రమేయం ఉన్నట్లు కూడా దర్యాప్తులో వెల్లడైంది. ఫరీదాబాద్‌లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు, ఆయుధాలను నిల్వ చేయడంలో షకీల్ సహాయం చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారని ‘ఇండియా టుడే’ తన కథనంలో పేర్కొంది.
ఈ కేసులో ఇద్దరు వైద్యుల ప్రమేయం ఉండటంతో జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ ప్రాంతానికి చెందిన అందరు వైద్యులపై దృష్టి సారించారు. వారికి జైష్ ఎ మొహమ్మద్, ఘజ్వత్ ఉల్ హింద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని జేకే పోలీసులతో పాటు భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడిన ఇద్దరు వైద్యులపై ఆయుధ చట్టంలోని సెక్షన్లు 7/25, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)లోని సెక్షన్లు 13, 28, 38, 39 కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


