ఢాకా: పొరుగుదేశం బంగ్లాదేశ్ బాంబులతో దద్దరిల్లుతోంది. పదవీచ్యుతురాలైన ప్రధాని షేక్ హసీనాపై నేడు (గురువారం) కోర్టు నుంచి కీలక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా బంగ్లాదేశ్.. కాల్పులు, దేశీయ బాంబు దాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇది 2024లో చోటుచేసుకున్న విద్యార్థి నిరసనలను తలపించింది. నాడు జరిగిన హింసాకాండలో 500 మందికి పైగా విద్యార్థులు, ప్రజలు మృతిచెందారు.
రాజధాని ఢాకా గురువారం పటిష్టమైన కోటగా మాదిరిగా మారింది. హసీనాకు చెందిన ‘అవామీ లీగ్ ’ ఢాకా లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో అటు పోలీసులు, ఇటు బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) సభ్యులు పెద్ద సంఖ్యలో మోహరించారు. ఢాకా ఎంట్రీ పాయింట్ల వద్ద బహుళ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజా రవాణాను అణువణువునా తనిఖీ చేస్తున్నారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఢాకాలోని రద్దీగా ఉండే రోడ్లలో నిశ్శబ్దం నెలకొంది.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనా, ఆమె సహాయకులపై మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాల కేసులో నేడు (నవంబర్ 13)న అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ) తీర్పు వెలువరించనుంది. ఈ నేపధ్యంలో బంగ్లాదేశ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత ఏడాది ఆగస్టులో భారతదేశానికి చేరుకున్న హసీనా పలు అభియోగాలను ఎదుర్కొంటున్నారు. వాటిలో హత్య, కుట్రతో పాటు పలు ఆరోపణలున్నాయి.
కాగా తాజాగా జరిగిన అల్లర్లలో నిరసనకారులు బ్రహ్మన్‌బారియాలోని ఒక గ్రామీణ బ్యాంకు శాఖకు నిప్పంటించి, అక్కడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పేదలకు మైక్రో క్రెడిట్ అందించడానికి 1983లో ముహమ్మద్ యూనస్ ఈ గ్రామీణ బ్యాంకును స్థాపించారు. నిరసనకారులు రాజధానితోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో పలు బస్సులను తగులబెట్టారు. ఢాకా పరిధిలో 17 చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయని, ముగ్గురు గాయపడ్డారని పలు నివేదికలు చెబుతున్నాయి.
రాజకీయ కార్యకలాపాల నుంచి నిషేధించిన హసీనా ‘అవామీ లీగ్’కు చెందిన 44 మంది సభ్యులను అరెస్టు చేసినట్లు ఢాకా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నారాయణగంజ్‌లో, పార్టీకి చెందిన మరో 29 మంది నేతలను, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢాకాలోని ఒక ఇంటి నుండి పెద్ద మొత్తంలో ముడి బాంబులు, పెట్రోల్ బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bihar Election: నితీష్ ఇంటి ముందు ‘టైగర్’ పోస్టర్


