కొద్ది నిమిషాల్లో మ్యాచ్‌.. గ్రౌండ్‌లోనే ప్రాణాలు విడిచిన కోచ్‌ | Dhaka Capitals coach Mahbub Ali Zaki's shocking death rocks BPL 2025-26 | Sakshi
Sakshi News home page

BPL: కొద్ది నిమిషాల్లో మ్యాచ్‌.. గ్రౌండ్‌లోనే ప్రాణాలు విడిచిన కోచ్‌

Dec 27 2025 3:14 PM | Updated on Dec 27 2025 4:06 PM

Dhaka Capitals coach Mahbub Ali Zaki's shocking death rocks BPL 2025-26

బంగ్లాదేశ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) ఫ్రాంచైజీ  ఢాకా క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జాకీ (59) ఆకస్మికంగా మరణించారు. శనివారం సిల్హెట్ వేదికగా రాజ్‌షాహి రాయల్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు కొద్ది నిమిషాల ముందు మహబూబ్ అలీ మైదానంలోనే కుప్పకూలారు.

వెంటనే స్పందించిన ఫిజియోలు ఆయనకు సీపీఆర్ (CPR) నిర్వహించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహబూబ్ ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషీయన్ దేబాశిష్ చౌదరి ధృవీకరించారు. ఈ విషాద ఘటన మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా చోటు చేసుకుంది. 

అయితే మహబూబ్ అలీ జాకీ మరణానికి గల ఖచ్చితమైన కారణాన్ని ఇంకా వెల్లడించలేదు. అయితే ఆయనకు గుండెపోటు (Cardiac Arrest) వచ్చినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అంతకుముందు వరకు ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, ఫిట్‌గానే ఉన్నారని సహచరులు తెలిపారు. 

ఈ వార్త తెలియగానే మైదానంలో ఉన్న ఆటగాళ్లు, అధికారులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే సిల్హెట్ టైటాన్స్, నోవాఖాలీ ఎక్స్‌ప్రెస్, చట్టోగ్రామ్ రాయల్స్ జట్లకు చెందిన ప్లేయర్లు, కోచ్‌లు తమ ప్రాక్టీస్ ఆపేసి ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయ‌న మృతి పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ ఎక్స్ వేదికగా సంతాపం వ్యక్తం చేసింది.

ఒక దిగ్గజ కోచ్‌గా..
బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ విభాగంలో జాకీ ఒక లెజెండరీ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అండర్-19 వరల్డ్ కప్(2020)ను బంగ్లాదేశ్ సొంతం చేసుకోవడంలో బౌలింగ్ కోచ్‌గా ఆయనది కీలక పాత్ర. అదేవిధంగా  టాస్కిన్ అహ్మద్‌, షోర్‌ఫుల్ ఇస్లాం వంటి స్టార్ పేస‌ర్లు జాకీ కోచింగ్‌లోనే రాటుదేలారు. ఆయ‌న బంగ్లాదేశ్ క్రికెట్ జ‌ట్టు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా, బౌలింగ్ యాక్షన్ రివ్యూ కమిటీ సభ్యుడిగా సేవ‌లందించారు.
చదవండి: టీమిండియా కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

 

Advertisement
 
Advertisement
Advertisement