
లుమ్‌ష్నాంగ్: మేఘాలయలోని లుమ్‌ష్నాంగ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం రాత్రి ఒక సిమెంట్ కంపెనీ ట్రక్కు ఢీకొనడంతో ఒక వ్యక్తి మృతిచెందాడు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు సిమెంట్ కంపెనీ పరిసరాలను ఆక్రమించి, సుమారు 15 ట్రక్కులను ధ్వంసం చేసి, వాటికి నిప్పు పెట్టారు.
వివరాల్లోకి వెళితే ఈ ఘటన జైంటియా హిల్స్ జిల్లాలోని వహియాజెర్ గ్రామం సమీపంలో జాతీయ రహదారి ఎన్‌హెచ్-6పై జరిగింది. తొలుత ఒక సిమెంట్ కంపెనీ ట్రక్కు ఒక పికప్ వాహనాన్ని ఢీకొంది. ఈ దరిమిలా ఆగ్రహించిన పికప్ వాహనం డ్రైవర్.. సిమెంట్ ట్రక్కు డ్రైవర్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అయితే సిమెంట్ ట్రక్కు డ్రైవర్ వేగంగా డ్రైవ్ చేస్తూ, పికప్ వాహనం డ్రైవర్‌ను ఢీకొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం సిమెంట్ ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడు.
విషయం తెలుసుకున్న స్థానికులు ఆయుధాలు చేతపట్టి సిమెంట్ కంపెనీ పరిసరాలను ఆక్రమించారు. సెంట్రీ పోస్ట్‌తో పాటు సీసీటీవీ వ్యవస్థలను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. అంతటితో ఆగక 15 ట్రక్కులు తగులబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు. జైంటియా హిల్స్ జిల్లా పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు. సిమెంట్ ట్రక్కు డ్రైవర్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ హింసాత్మక ఉదంతానికి సంబంధించి ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటన నేపధ్యంలో లుమ్‌ష్నాంగ్ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అదనపు పోలీసు బలగాలను మోహరించారు.
ఇది కూడా చదవండి: గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక