
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్‌ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.
ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: ఇన్‌ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి