
తాబేళ్లు అత్యంత విచిత్రమైన జీవులు. ఇవి ఎక్కువగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా కనిపిస్తాయి. ఎంతో ఆకర్షణీయంగానూ ఉంటాయి. తాబేళ్లు ప్రపంచంలోని పురాతన సరీసృపాల సమూహాలలో ఒకటి. ఇవి పాములు, మొసళ్లకన్నా ముందునాటి జీవులు. అలాగే డైనోసార్ల కాలం నుండి ఉన్నాయి. ప్రపంచంలో 300 రకాల తాబేళ్లు ఉండగా, వాటిలో 129 రకాలు అంతరించిపోతున్నాయి. తాబేళ్లు పర్యావరణానికి ఎలా దోహదపడతాయో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతీయేటా మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని(World Turtle Day) నిర్వహిస్తుంటారు.
తాబేళ్లు వాటి సహజ ఆవాసాలలో జీవించడానికి, అభివృద్ధి చెందడానికి సహాయపడే దిశగా అవగాహన కల్పించేందుకు ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1990లో సుసాన్ టెల్లెం, మార్షల్ థాంప్సన్ జంట స్థాపించిన అమెరికన్ తాబేలు రెస్క్యూ (ఏటీఆర్) ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. తాబేళ్ల సంరక్షణకు దోహదపడే వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పాఠశాలల్లో తాబేళ్లపై అవగాహన పెంపొందించడానికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తాబేళ్లు.. వాటిని వేటాడే జంతువుల నుంచి రక్షణ పొందేందుకు బలమైన పెంకులు కలిగిన సరీసృపాలు. ఇంటిగ్రేటెడ్ టాక్సానమిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(Integrated Taxonomic Information System) (ఐటీఐఎస్) తెలిపిన వివరాల ప్రకారం తొలుత టెస్టూడైన్స్ ( చెలోనియా) అనే తాబేలు క్రమం క్రిప్టోడిరా, ప్లూరోడిరా అనే రెండు ఉపక్రమాలుగా విభజితమయ్యింది. ఆపై 13 కుటుంబాలు, 75 జాతులు,300కుపైగా జాతులుగా విభజితయ్యింది. అంటార్కిటికాలో మినహా మిగిలిన ప్రాంతాల్లో తాబేళ్లకు అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రతి ఖండంలోనూ తాబేళ్లు కనిపిస్తాయి. ఆగ్నేయ ఉత్తర అమెరికా, దక్షిణాసియాలు పలు తాబేలు జాతులకు నిలయంగా ఉన్నాయి.
తాబేళ్లు స్నేహపూర్వక జంతువులు కావు. ఇతర తాబేళ్లు సమీపంలో ఉన్నాఅవి వాటితో కలిసి ఉండవు. అవి ఆహారం కోసం రోజంతా చురుకుగా తిరుగాడుతుంటాయి. తాబేళ్లు విద్యుత్ మోటార్ల మాదిరిగా శబ్దం చేస్తాయి. కొన్ని రకాల తాబేళ్లు కుక్కలలాగా మొరుగుతాయి. దక్షిణ అమెరికాలోని ఎర్రటి పాదాల తాబేలు కోడిలాగా అరుస్తుంది. కాగా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్)) పలు తాబేళ్ల జాతులను అంతరించిపోతున్న జాబితాలోకి చేర్చింది. తాబేళ్లు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వాటిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇది కూడా చదవండి: ట్రంప్ ఆదేశాలు.. వారికి ‘హార్వర్డ్’లో నో అడ్మిషన్