
వాషింగ్టన్ డీసీ: ట్రంప్ పరిపాలనా విభాగం విదేశీ విద్యార్థులకు పిడుగుపాటు లాంటి వార్త వినిపించింది. ఇకపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం(Harvard University)లో విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విశ్వవిద్యాలయంపై కొనసాగించిన దర్యాప్తు దరిమిలా ట్రంప్ పరిపాలనా విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ విశ్వవిద్యాలయానికి ఒక లేఖ పంపారు.
క్రిస్టి నోయెమ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ఈ వివరాలను తెలియజేస్తూ వర్శిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోగలగడం అనేది హక్కు కాదని, అది ప్రత్యేక అవకాశం అని పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరానికి ముందే హార్వర్డ్ స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందే అవకాశాన్ని వర్శిటీ కోరుకుంటే 72 గంటల్లోపు అందుకు అవసరమైన సమాచారాన్ని అందించాలని ఆమె పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలన విభాగం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రస్తుత విద్యార్థులను ఇతర విద్యాసంస్థలకు బదిలీ చేయవలసి వస్తుందని, లేదా వారి చట్టపరమైన హోదాను కోల్పోయేలా చేస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం(Department of Homeland Security తెలిపింది.
దీనిపై స్పందించిన విశ్వవిద్యాలయం ఇది ట్రంప్ ప్రతీకార చర్య అని, ఈ నిర్ణయం విశ్వవిద్యాలయానికి హాని కలిగిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ చర్య చట్టవిరుద్ధమని, 140కిపైగా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. కాగా గత ఏప్రిల్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్వర్డ్‌ను ఒక జోక్‌గా అభివర్ణించారు. హార్వర్డ్‌ను ఇకపై మంచి అభ్యాస ప్రదేశంగా కూడా పరిగణించలేమని, దానిని ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల జాబితాలో ఒకటిగా పరిగణించకూడదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో వ్యాఖ్యానించారు. విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం 2024-2025 విద్యా సంవత్సరంలో హార్వర్డ్ దాదాపు 6,800 మంది అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకుంది. ఇది అక్కడి మొత్తం విద్యార్థులలో27 శాతం. ప్రస్తుతం భారతదేశానికి చెందిన 788 మంది విద్యార్థులు హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: జ్యోతి పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పొడిగింపు