
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా(YouTuber Jyoti Malhotra) పోలీసు కస్టడీని నాలుగు రోజులు పొడిగించారు. ఆమెను మే 17న హర్యానాలోని హిసార్‌లో అరెస్టు చేసి, ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అది ఈరోజు(గురువారం)తో ముగిసింది. ఈ నేపధ్యంలో కోర్టు ఆమె పోలీసు కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగించింది.
ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేసిన పాకిస్తాన్ సిబ్బందితో ఆమెకు సంబంధాలునున్నాయనే ఆరోపణలతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) సమయంలో భారతదేశంలో విద్యుత్ సరఫరా నిలిపివేత(బ్లాక్ అవుట్) కు సంబంధించిన వివరాలతో పాటు పలు సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌తో పంచుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో టచ్‌లో ఉన్నట్లు బలమైన ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయని తెలుస్తోంది.
విచారణ అధికారులు జ్యోతి మల్హోత్రాకు చెందిన మూడు మొబైల్ ఫోన్‌లను, ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ పరీక్ష కోసం స్వాధీనం చేసుకున్నారు. కాగా జ్యోతి.. పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్ మధ్య జరిగిన చాట్ రికార్డులు పోలీసులకు లభ్యంకాలేదని అధికారులు తెలిపారు. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో జ్యోతి.. డానిష్‌తో సంప్రదింపులు జరిపారని అధికారులు నిర్ధారించారు. అలాగే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నానని యూట్యూబర్ జ్యోతి అధికారుల ముందు అంగీకరించారని తెలుస్తోంది. 2023లో జ్యోతి.. పాక్ సందర్శనకు వీసా కోసం పాకిస్తాన్ హైకమిషన్‌కు వెళ్ళినప్పుడు ఆమె డానిష్‌ను కలిశారని అధికారుల విచారణలో వెల్లడయ్యింది.
ఇది కూడా చదవండి: 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ