IBD లక్షలమందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి, మొహమాటం వద్దు! | Symptoms, Causes and Prevention Of Inflammatory Bowel Disease (IBD) | Sakshi
Sakshi News home page

IBD లక్షలమందిని ప్రభావితం చేస్తున్న వ్యాధి, మొహమాటం వద్దు!

May 20 2025 4:14 PM | Updated on May 20 2025 4:25 PM

Symptoms, Causes and Prevention Of Inflammatory Bowel Disease (IBD)

కొన్ని ల‌క్ష‌ల మందిని ప్ర‌భావితం చేస్తున్న పేగుల వ్యాధి: ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ క‌లువ‌ల హ‌ర్ష

హైదరాబాద్:  ఇన్‌ఫ్ల‌మేట‌రీ బవెల్ డిసీజ్ లేదా ఐబీడీ ( Inflammatory Bowel Disease (IBD)) చాలామంది నోట ఇది వినిపిస్తుంది. దీర్ఘ‌కాల వ్యాధి కావ‌డంతో ఇది జీవ‌న‌శైలినే మార్చేస్తుంది. దీనికి వెంట‌నే చికిత్స అవ‌స‌రం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోటి మంది, మ‌న దేశంలోనే 15 లక్ష‌ల మంది ఈ వ్యాధి బాధితులున్నారు. క్రాన్స్ డిసీజ్‌, అల్స‌రేటివ్ కొలైటిస్ లాంటి స‌మ‌స్య‌లతో క‌లిపి వ‌చ్చే ఐబీడీని వెంట‌నే గుర్తిస్తున్నా, సామాజిక స‌మ‌స్య‌ల కార‌ణంగా దీనిపై ఎవ‌రూ పెద్ద‌గా చ‌ర్చించ‌డం లేదు. ఈ నెల 19న ప్ర‌పంచ ఐబీడీ దినోత్స‌వం. ఈ సంద‌ర్భంగా దీనికి స‌రిహ‌ద్దులు లేవ‌ని, అంద‌రం క‌లిసి సామాజిక అపోహ‌ల‌ను తొల‌గిద్దామ‌ని ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ క‌లువ‌ల హ‌ర్ష సూచించారు.

ఐబీడీ చికిత్స కోసం ఆస్టర్ ప్రైమ్ ఆస్ప‌త్రి ఒక ప్ర‌ముఖ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. అందులో మెడిక‌ల్, స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టులు, ఐబీడీకి శిక్ష‌ణ పొందిన వైద్యులు, న‌ర్సులు, డైటీషియ‌న్లు, సైకాల‌జిస్టులు ఉన్నారు. దీనికి ప్ర‌త్యేకంగా కేటాయించిన 20 ప‌డ‌క‌లు, అత్యాధునిక స‌దుపాయాల‌తో అనేక‌మంది రోగుల‌కు ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రి అత్యాధునిక చికిత్స‌లు అందిస్తోంది. ప‌లు జిల్లాల నుంచి వైద్యులు రోగుల‌ను ఇక్క‌డ‌కు పంపుతున్నారు. ముఖ్యంగా ఈఎంఆర్ ఆధారిత ఫాలోఅప్ కార్య‌క్ర‌మం ఉండ‌డం, అంద‌రికీ వ్య‌క్తిగ‌త సంర‌క్ష‌ణ కోసం వారానికోసారి ఐబీడీ క్లినిక్ ఏర్పాటుచేయ‌డం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌లు.

“ఐబీడీ అనేది కేవ‌లం క‌డుపు స‌మ‌స్యే కాదు. అది మ‌న మొత్తం శ‌రీరం, మ‌న‌సునూ ప్ర‌భావితం చేస్తుంది. కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు, స‌మస్య తీరు, దాని ల‌క్ష‌ణాలైన‌.. త‌ర‌చు విరేచ‌నాలు కావ‌డం, క‌డుపునొప్పి, మ‌ల‌ద్వారం నుంచి ర‌క్తం కావ‌డం, నీర‌సం వ‌ల్ల రోగులు దీని గురించి చివ‌ర‌కు కుటుంబ‌స‌భ్యుల‌కు కూడా చెప్ప‌రు. మౌనంగా బాధ‌ను భ‌రిస్తుంటారు. పేగు సంబంధిత స‌మ‌స్య‌లంటేనే స‌మాజంలో ఉన్న చిన్న‌చూపు వ‌ల్ల ఐబీడీ గురించి కూడా మాట్లాడ‌రు. దీని కార‌ణాల గురించి కూడా అనేక అపోహ‌లున్నాయి. ఇలా చెప్ప‌క‌పోవడంతో వ్యాధిని గుర్తించ‌డం ఆల‌స్యం అవుతుంది, వారు స‌మాజం నుంచి దూర‌మ‌వుతారు, ఆందోళ‌న‌, కుంగుబాటు లాంటి మాన‌సిక స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. ఐబీడీ అనేది ఆహారం వ‌ల్ల‌నో, ప‌రిశుభ్ర‌త లేక‌పోవ‌డం వ‌ల్ల‌నో వ‌స్తుంద‌ని.. ఇది కేవ‌లం అరుగుద‌ల స‌మ‌స్య అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఐబీడీ అనేది ఒక ఆటోఇమ్యూన్ స‌మ‌స్య‌. దానికి దీర్ఘ‌కాలం పాటు చికిత్స అవ‌స‌రం” అని డాక్ట‌ర్ హ‌ర్ష చెప్పారు.

ఇదీ చదవండి: 24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!

“ఐబీడీకి ప్రస్తుతం కచ్చితమైన చికిత్స తెలియదు గానీ, దాన్ని మందులు, ఆహారంలో మార్పులు,  మానసిక చికిత్స‌, నిపుణులతో క్రమం తప్పకుండా సంప్ర‌దించ‌డం ద్వారా దీన్ని చాలావ‌ర‌కు నియంత్రించ‌వ‌చ్చు.  జీవనశైలిలో మార్పులు, ఒత్తిడిని అధిగ‌మించ‌డం, సహచరుల‌ మద్దతు ముఖ్యమైనవి. ప్రత్యేకంగా స్కూళ్లు, కాలేజీల‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, రిలేష‌న్‌లో ఉన్న యువ‌కులకు ఇది అవ‌స‌రం. ఆహారంపై అవ‌గాహ‌న కూడా ముఖ్యం. మంట వ‌చ్చిన‌ప్పుడు సుల‌భంగా జీర్ణ‌మ‌య్యే అన్నం, అర‌టిపండ్లు, ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌లు తినాలి. కారాలు, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఆహారాలు తిన‌కూడ‌దు.  ఎవ‌రికి వారికే ఆహారం మారుతుంది కాబ‌ట్టి, డైటీషియ‌న్ స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

చదవండి: వామ్మో.. తృటిలో తప్పింది : లేదంటే అంతేగా!

అస‌లు అన్నింటికంటే ముందు మౌనం వీడాలి. బ‌హిరంగంగా చ‌ర్చించాలి. అది క్లినిక్‌లో అయినా, త‌ర‌గ‌తుల్లో అయినా, కార్పొరేట్ ఆఫీసుల్లో అయినా. ఐబీడీ గురించి మాట్లాడితే అపోహ‌లు పోతాయి. సానుభూతి పెరుగుతుంది. రోగులు చికిత్స పొంద‌డానికి అవ‌స‌ర‌మైన ఆత్మ‌విశ్వాసం వ‌స్తుంది” అని డాక్ట‌ర్ హ‌ర్ష వివ‌రించారు.

 

 

 



ఆస్ట‌ర్ ప్రైమ్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్ట్ డాక్ట‌ర్ క‌లువ‌ల హ‌ర్ష 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement