
అక్టోబర్ 12 ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం
వయసు నలభై దాటితే చాలు..మనలో చాలామంది కీళ్లనొప్పులంటూ ఉంటారు. వీరిలో చాలామంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) తో బాధపడుతూంటారు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే సమస్య ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. హానికారక సూక్ష్మజీవులేవీ శరీరంలోకి చొరబడకుండా కాపుకాసే రోగ నిరోధక వ్యవస్థే కొన్ని పరిస్థితుల్లో శరీర కణజాలంపైనే దాడులు చేయడం దీనికి కారణం. అందుకే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని పిలుస్తూంటారు. ఇందులో రోగ నిరోధక వ్యవస్థ మీ కీళ్ల మృదువైన లైనింగ్‌ను సజావుగా కదిలేలా చేసే సైనోవియంపై కేంద్రీకృతమై ఉంటుంది. దేశంలో 2021 నాటికే దాదాపు కోటి ముప్ఫై లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అంచనాలున్నాయి. అయితే చాలా వ్యాధుల మాదిరిగానే రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను కూడా వీలైనంత ముందుగా గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించవచ్చునని, నొప్పి, ఇతరత్రా బాధలూ తక్కువగా ఉంటాయని అంటున్నారు నిపుణులు.
రోగ నిరోధక వ్యవస్థ సైనోవియంపై దాడి చేయడం దీర్ఘకాలం కొనసాగితే కీళ్ల నొప్పి, వాపు, స్టిఫ్‌నెస్ పెరుగుతుంది. కాలక్రమేణా, ఇది మృదులాస్థిని, ఎముకలను దెబ్బ తీస్తుంది. చికిత్స చేయకపోతే ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. తొందరగా గుర్తించి ప్రభావవంతమైన చికిత్స కల్పించకపోతే కీళ్లకు శాశ్వతంగా నష్టం కలిగిస్తుంది. వైకల్యానికి కారణమవుతుంది. భారతదేశంలో, ముఖ్యంగా 30 - 60 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి మరింత అవగాహన కల్పించాల్సిన అవసరముందని రుమటాలజిస్టులు నిపుణులు, స్పష్టం చేస్తున్నారు. ఈ వయసు మహిళల్లో ఈ వ్యాధి ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. అయితే చాలామందికి ఈ విషయం తెలియదు. గుర్తించడం, చికిత్స అందించడం రెండూ తక్కువే.
హైదరాబాద్‌లోని అడ్వాన్స్‌డ్ రుమటాలజీ సెంటర్‌లోని సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ డాక్టర్ సర్వ్‌జీత్ పాల్ మాట్లాడుతూ, ‘‘రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను వీలైంత ముందుగా గుర్తిస్తే సమస్య మరీ చేయిదాటిపోకుండా నెమ్మదింపజేయవచ్చు. నొప్పి నుంచి ఉపశమనం పొందడంలోనూ ఇది కీలకం. చాలామందిలో ఈ వ్యాధి చిన్నస్థాయిలోనే మొదలవుతుంది. ఉదయాన్నే మీ కీళ్లు 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం బిగుసుకుపోయి ఉంటే, వాచిపోయినా, వివరించలేని తక్కువ-స్థాయి జ్వరం, బాగా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చుని గుర్తించండి. తక్షణం వైద్య సాయం పొందే ప్రయత్నం చేయండి’’ అని అన్నారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో శరీరం రెండువైపుల ఉన్న కీళ్లలో సమస్య ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు ఒక మణికట్టు నొప్పిగా ఉంటే, రెండోది కూడా తరచూ బాధిస్తుంది. సాధారణంగా చేతులు, కాళ్లలోని చిన్న కీళ్లతో మొదలై కాలక్రమేణా పెద్దవాటికి వ్యాపిస్తుంది. రోజువారి పనులు చేసుకోవడంలోనూ కొంతమందికి కష్టతరం చేస్తుంది. కొంతమందిలో ఒకవైపు మాత్రమే సమస్యలున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ముఖ్యంగా ప్రారంభ దశలలో లేదా తక్కువ కీళ్లపై ప్రభావం ఉన్నప్పుడు... ఉదయం లేదా విశ్రాంతి సమయంలో పరిస్థితి అధ్వాన్నంగా అనిపిస్తుంది. కదలికలతో కొద్దిగా మెరుగుపడవచ్చు కానీ పనులు చేస్తూంటే నొప్పి తిరిగి రావచ్చు తీవ్రం కావచ్చు.
అబాట్ ఇండియా మెడికల్ అఫైర్స్ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ అంకిత్ రాయ్ మాట్లాడుతూ, “రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేవలం ‘వృద్ధాప్యంలో వచ్చే’ సమస్య కాదు. రోగాన్ని వీలైనంత వేగంగా గుర్తించడంతోపాటు వ్యాధి పురరోగమనానికి అనుగుణంగా స్థిరమైన, వ్యక్తిగతీకరించిన సంరక్షణ కూడా అవసరం. అబాట్ వద్ద, సకాలంలో జోక్యం, దీర్ఘకాలిక నిర్వహణకు మద్దతు ఇచ్చే సాధనాలతో వైద్యులు, రోగులు ఇద్దరికీ సాధికారత కల్పించడంపై దృష్టి సారించాం’’ అన్నారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిర్వహణ సరైన చికిత్సా ప్రణాళికను గుర్తించడంతో ప్రారంభమవుతుంది. సాధారణంగా వైద్యులు బయోలాజిక్స్‌ను సిఫారసు చేస్తూంటారు. ఇది... కీళ్ల నొప్పి, వాపునకు కారణమయ్యే రోగనిరోధక వ్యవస్థ భాగాలను లక్ష్యంగా చేసుకునే ప్రత్యేక చికిత్స.
బయోసిమిలర్లు అనేవి బయోలాజిక్స్ లాగానే పనిచేయడానికి రూపొందించబడిన మందులు. అవి అసలు బయోలాజిక్ లాగానే సురక్షిత, ప్రయోజనాలను అందిస్తాయి, పని చేసే విధానం కూడా అదే విధంగా ఉంటుంది, తక్కువ ఖర్చుతో ఉంటాయి.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ నిరోధానికి...
క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి: ఈత, సైక్లింగ్, నడక లేదా యోగా వంటి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం నొప్పి, ఉదయం పూట స్టిఫ్‌నెస్, అలసటను తగ్గించడంలో సహాయపడతాయి.
సమతుల ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో వచ్చే సమస్యల పురోగతి, ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
ఒత్తిడిని తగ్గించుకోండి: ధ్యానం, యోగా, మైండ్‌ఫుల్‌నెస్ వంటి వాటితో రుమటాయిడ్ ఆర్థరైటిస్ రోగులకు ఎంతో మేలు జరుగుతుంది.