స్పెయిన్‌లో ఒక విచిత్రమైన ఉద్యోగ వివాదం వార్తల్లో నిలిచింది. దాదాపు రెండేళ్ల పాటు క్రమం తప్పకుండా 40 నిమిషాల ముందుగానే ఆఫీస్‌కు వస్తోన్న ఒక ఉద్యోగినిని ఆ కంపెనీ తొలగించింది. ఆఫీస్‌కు అర్లీగా వస్తే తొలగిస్తారా? అంటూ కంపెనీని కోర్టుకు లాగింది ఆ 22 ఏళ్ల ఉద్యోగిని. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదవండి...
అసలేం జరిగిందంటే..
మెట్రో వార్తా సంస్థ నివేదిక ప్రకారం.. ఆ ఉద్యోగిని షిఫ్ట్ ఉదయం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. కానీ ఆమె ఉదయం 6:45 నుంచి 7:00 గంటల మధ్యే ఠంచనుగా ఆఫీస్‌కు వెళ్లిపోయేది. ఉద్యోగిని ముందుగా రావడం ప్రారంభంలో మంచి అలవాటుగా కనిపించినా, ఆ సమయంలో ఆమె చేయడానికి ఎలాంటి పని లేకపోవడం, అలాగే ముందుగా రాకూడదన్న సంస్థ ఆదేశాలను ఆమె పదేపదే లెక్కచేయకపోవడం కంపెనీ యాజమాన్యాన్ని అసహనానికి గురి చేసింది. దీంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.
కంపెనీ ఏం చెబుతోందంటే..
సంస్థ మాటల్లో.. ఉద్యోగి ముందుగానే రావడం వల్ల ఎటువంటి ఉత్పాదకతా అందించకపోగా, నిర్ణయించిన సమయాలకు కట్టుబడే నిబంధనలను సదరు ఉద్యోగిని నిర్లక్ష్యం చేసింది. పలుమార్లు మౌఖికంగా, రాతపూర్వకంగా హెచ్చరించినప్పటికీ ఆమె తన అలవాటు మార్చుకోలేదు. ఇక, ఆమె 19 సందర్భాల్లో ఆఫీస్ ప్రాంగణంలోకి రాక ముందే కంపెనీ యాప్‌లో లాగిన్ కావడానికి ప్రయత్నించినట్లు కూడా సంస్థ పేర్కొంది. ఇది మోసపూరిత చర్యగా కంపెనీ యాజమాన్యం పరిగణించింది.
తొలగింపు అన్యాయమంటూ కోర్టుకు..
తన తొలగిపింపును సవాలు చేస్తూ ఆ మహిళ అలికాంటే సోషల్ కోర్టును ఆశ్రయించింది. ఆమె వాదన ఏమిటంటే ముందుగా రావడం తప్పు కాదు. కంపెనీ యాజమాన్యం తనపట్ల అన్యాయం చేసింది.
భిన్నంగా కోర్టు తీర్పు
అయితే, కోర్టు ఈ వాదనలు అంగీకరించలేదు. గైర్హాజరు లేదా ఆలస్యంగా రావడం కాకుండా అత్యధిక సమయపాలన కూడా నియమావళిని ఉల్లంఘించే పరిస్థితుల్లో సమస్యగా మారుతుందని కోర్టు స్పష్టం చేసింది. సంస్థ నిబంధనలను పాటించడానికి ఉద్యోగి నిరాకరించిందని, ఇది స్పానిష్ వర్కర్స్ స్టాట్యూట్ ఆర్టికల్ 54ను ఉల్లంఘించడమేనని తీర్పులో పేర్కొంది.
అంతేకాకుండా ముందుగానే రావడం కారణంగా జట్టు సమన్వయానికి అంతరాయం ఏర్పడిందని మరో ఉద్యోగి ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఉద్యోగిని తొలగించడం సముచితమేనని నిర్ణయిస్తూ కోర్టు యజమానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.


