Cervical Cancer: అమ్మకడుపులో రాచపుండు | Cervical cancer - Symptoms and causes | Sakshi
Sakshi News home page

Cervical Cancer: అమ్మకడుపులో రాచపుండు

Jan 29 2025 1:27 PM | Updated on Jan 29 2025 1:27 PM

Cervical cancer - Symptoms and causes

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో ఇబ్బందులు 

క్యాన్సర్‌ బాధితుల్లో 20 శాతం మందికి ఇదే సమస్య  

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 60 వేల మంది బాధితులు 

జనవరి గర్భాశయ ముఖ ద్వార అవగాహన మాసం   

మనిషి పుట్టుకకు ప్రధాన అవయవమైన గర్భాశయమే పుండుగా మారుతోంది. ఎలాంటి లక్షణాలు కనిపించకుండా లోలోపలే ఇబ్బంది పెడుతోంది. అనంతరం క్యాన్సర్‌గా మారి అమ్మనే కబలిస్తోంది. ప్రాథమిక దశలో దీనిని గుర్తిస్తే ప్రాణాలతో బయట పడవచ్చు. వ్యాధి ముదిరిపోయిన తర్వాత గుర్తిస్తే మాత్రం ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధిపై అవగాహన లేక చాలా మంది మహిళలు తమలోపల క్యాన్సర్‌ ఉందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలి్పంచడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా జనవరి మాసాన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అవగాహన మాసంగా నిర్వహించాలని   ఆదేశించింది. 

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను వైద్యపరిభాషలో సెర్వికల్ క్యాన్సర్ అంటారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా మహిళల్లో నాల్గవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా, మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇది రెండవ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉండే క్యాన్సర్‌ వైద్యుల వద్దకు ప్రతిరోజూ 120 నుంచి 150 మంది వరకు కొత్తగా క్యాన్సర్‌ బాధితులు చికిత్స కోసం వస్తున్నారు. కర్నూలులో ఒక ప్రభుత్వ, రెండు ప్రైవేటు క్యాన్సర్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా క్యాన్సర్‌ ఆసుపత్రుల్లో ప్రతిరోజూ 20 నుంచి 30 మందికి కీమోథెరపీ, 40 మందికి రేడియోథెరపీ చేస్తున్నారు. ఈ ఆసుపత్రుల్లో నిత్యం 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లు చికిత్స తీసుకుంటున్నారు. ఇందులో 20 శాతం మంది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌(సెర్వికల్‌ క్యాన్సర్‌) బాధితులు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య 60 వేలకు పైగా ఉంటుందని వైద్యుల అంచనా. పేదరోగులకు అన్ని రకాల క్యాన్సర్‌ వ్యాధులకు డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ)లో ఉచితంగా వైద్యం అందుతోంది. 

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణాలు 
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ప్రధానంగా హ్యూ మన్‌ పాపిల్లోమా వైరస్‌(హెచ్‌పీవీ) కారణంగా వస్తుంది. ఇదే గాక తక్కువ వయస్సులో వివాహం చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, స్త్రీ, పురుషులిద్దరిలో బహుళ లైంగిక భాగస్వాములుగా ఉండటం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడ ం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్‌ రావడానికి కారణాలు. ఈ క్యాన్సర్‌ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారిలో ఎక్కువగా వస్తోంది.  

నివారణ చర్యలు 
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాల ప్రకారం 2030 నాటికి 90 శాతం కౌమార బాలికలకు 15 ఏళ్ల వయస్సులోపు హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు వేయాలి. 70 శాతం మహిళలు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారికి కచ్చితంగా స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలి. గర్భాశయ పూర్వ క్యాన్సర్‌ లేదా క్యాన్సర్‌తో బాధపడుతున్న 90 శాతం మహిళలకు తగిన చికిత్స అందించాలి. ప్రజల్లో అవగాహన కలి్పంచేందుకు జనవరి మాసాన్ని సర్వికల్‌ క్యాన్సర్‌ అవగాహన మాసంగా విస్తృత ప్రచారం నిర్వహించాలి.  

  1. వ్యాధి లక్షణాలు 
    ⇒ రుతుక్రమంలో సమస్యలు..   యోని నుంచి రక్తస్రావం 
    ⇒ లైంగిక సంపర్కం తర్వాత రక్తస్రావం 
    ⇒పీరియడ్స్‌ ఆగిపోయిన తర్వాత రక్తస్రావం (మెనోపాజ్‌) 
    ⇒ యోని నుంచి దుర్వాసన, రక్తంతో  కూడిన గడ్డలు రావడం 
    ⇒ మూత్రం, మల విసర్జనలో ఆటంకాలు

 హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి 


వివాహమైన మహిళలు ఏటా గర్భాశయ ముఖద్వారంలో పాప్‌స్మియర్‌ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ మేరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే దీనిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. దీనికి తోడు కౌమారదశ బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయడం వల్ల వారికి 70 నుంచి 80 శాతం వరకు ఈ క్యాన్సర్‌ రాకుండా నివారించవచ్చు. సాధారణంగా మహిళలకు హెచ్‌పీవీ వైరస్‌ సోకిన 10 నుంచి 15 ఏళ్ల తర్వాత క్యాన్సర్‌గా మారుతుంది.  
– డాక్టర్‌ టి.జ్యోత్స్న, గైనకాలజిస్టు, కర్నూలు

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా పరీక్షలు 


కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని గైనకాలజీ విభాగానికి గైనిక్‌ సమస్యలతో వచ్చే ప్రతి వంద మంది మహిళల్లో ఇద్దరు, ముగ్గురికి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఉంటోంది. ఓపీకి వచ్చే వారికి పాప్‌స్మియర్‌ పరీక్షను చేస్తున్నాం. ఇందులో అసాధారణంగా కనిపించే వారికి కాల్పోస్కోపి టెస్ట్‌ ద్వారా బయాప్సీ తీసి పంపిస్తున్నాం. అందులో క్యాన్సర్‌గా నిర్ధారణ అయితే స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా లక్షణాలు ఉన్నా లేకపోయినా పాప్‌స్మియర్‌ పరీక్ష చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి వారికి చికిత్స ఇచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది.  
– డాక్టర్‌ పి.స్నేహ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, గైనకాలజీ విభాగం, జీజీహెచ్, కర్నూలు

 

Advertisement
 
Advertisement
Advertisement