
ఆ వీసాదారులను పంపించేయాలి
భారత సంతతి రిపబ్లికన్ వ్యాఖ్యలు
మీ వలస నేపథ్యం మర్చిపోయారా?
రోహిత్‌పై మండిపడుతున్న ఎన్నారైలు
టెక్సాస్: భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ నేత రోహిత్ జాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలి. ఆ కార్యక్రమాన్నే ఆపేయాలి. హెచ్–1బీ వీసాదారులను అమెరికా నుంచి పంపించేయాలి’’అంటూ ట్రంప్ సర్కారుకు మతిలేని సూచనలు చేశారు. హెచ్–1బీ, ఇతర వీసాదారుల వీసాలు పునరుద్ధరించాలన్న రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్‌కారి్మక్ వ్యాఖ్యలను జాయ్ వ్యతిరేకించారు.
అమెరికాను పోటీలో ముందు నిలపడంలో హెచ్–1బీ వీసా విధానం పాత్ర ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలపై ఆన్‌లైన్‌లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. హెచ్–1బీ వీసాదారుల్లో అత్యధికులు భారతీయులేనన్నది తెలిసిందే. వారంతా జాయ్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఆయన తన వలస నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలుకుతున్నారు.
‘మీరు సౌకర్యవంతంగా స్థిరపడ్డాక అందుకు దోహదపడ్డ నిచ్చెనను లాగేయాలని అనుకుంటున్నారా?’అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాయ్ కుటుంబం ఆ వీసా పథకం ద్వారానే లబ్ధి పొందిన విషయాన్ని మర్చిపోవద్దని అంటున్నారు. అమెరికా కంపెనీలు నిపుణులైన విదేశీయులను నియమించుకునేందుకు హెచ్–1బీ వీసా వీలు కలి్పస్తుంది. 2022లో జారీ అయిన 3.2 లక్షల హెచ్–1బీ వీసాల్లో 77 శాతం భారతీయులే దక్కించుకున్నారు. 2023లో 3.86 లక్షల వీసాల్లోనూ 72.3 శాతం వాటా వారిదే. హెచ్–1బీ వర్క్ వీసా తొలుత మూడేళ్లపాటు చెల్లుబాటవుతుంది. తరువాత ఆరేళ్ల పొడిగించుకోవచ్చు.