
పోలీసుల స్టింగ్ ఆపరేషన్
రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్
కొలంబస్: అమెరికా స్టార్ రెజ్లర్ కైల్ స్నైడర్ వ్యభిచారం కేసులో అరెస్టయ్యాడు. 20 ఏళ్ల వయసులో రియో ఒలింపిక్స్ (2016)లో ఫ్రీస్టయిల్ 97 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన స్నైడర్ టోక్యో ఒలింపిక్స్ (2020)లో రజత పతకం సాధించాడు. పిన్నవయసులో అమెరికా రెజ్లింగ్ చాంపియన్‌గా ఘనతకెక్కిన స్నైడర్‌ను వ్యభిచారం కేసులో ఈ నెల 9న అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో స్నైడర్ హోటల్ గదిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
29 ఏళ్ల స్నైడర్‌ను తాజాగా కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి అతనికి 250 అమెరికన్ డాలర్లు (రూ. 21,386) జరిమానా విధించడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం ఒక రోజంతా పని చేయాలని ఆదేశించారు. తీర్పు అనంతరం తన తప్పుపట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రెజ్లర్ ఇకపై సరైన నిర్ణయాలతో జీవితాన్ని కొనసాగిస్తానని, తన తప్పువల్ల కుటుంబం పడిన వేదన తనకు అర్థమైందని వాపోయాడు.
అతని భార్య మ్యాడీ ఫుట్‌బాల్ ప్లేయర్! రెండు వరుస ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన స్నైడర్ గతేడాది పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ఓడి నాలుగో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్నైడర్ మూడు స్వర్ణ పతకాలు (2015, 2017, 2022), రెండు రజత పతకాలు (2018, 2021), రెండు కాంస్య పతకాలు (2019, 2023) సాధించాడు. అమెరికాలోని నేషనల్ కాలేజ్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్‌సీఏఏ) క్రీడల్లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచాడు.
ఓవరాల్‌గా తన 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో స్నైడర్ 30 స్వర్ణ పతకాలు, 5 రజత పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచాడు. 199 బౌట్‌లలో నెగ్గి, 21 బౌట్‌లలో మాత్రమే ఓడిపోయాడు. ఇటీవలే అతను రియల్ అమెరికన్ ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.