స్నానం చేస్తూ వీడియోకాల్ మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రీధర్
శ్రీధర్ నన్నే కాదు.. కాలేజ్ అమ్మాయిలనూ వేధించారు
నేను చూపించిన ఆధారాలన్నీ వాస్తవాలు.. కావాలంటే పోలీసులు చెక్ చేసుకోవచ్చు: ఎమ్మెల్యే బాధిత మహిళ
సాక్షి, అమరావతి: రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకత్వం అంతా ఇంతా కాదని, అతని చేతిలో లైంగిక వేధింపులకు ఎందరో గురయ్యారని బాధిత మహిళా ఉద్యోగిని విమర్శించారు. శ్రీధర్ తల్లి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. శ్రీధర్ తననే కాకుండా మరికొందరు కాలేజ్ అమ్మాయిలనూ లైంగికంగా వేధించారని, వారిని లోబరుచుకోవడానికి యత్నించారని ఆమె వెల్లడించారు. ఆ విషయాన్ని కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర స్వయంగా తనతో ఫోన్‌లో చెప్పారని, ఇప్పుడు అదే నేత తనను తప్పుపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకా ఆమె ఏమన్నారంటే.. శ్రీధర్ తల్లి, కూటమి నేత తాతంశెట్టి నాగేంద్ర విలేకరుల సమావేశం పెట్టి, నేను చూపించిన వీడియోలు డీప్ ఫేక్ అని అంటున్నారు. ఇదే నాగేంద్ర నాలుగు రోజల కిందట నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల గురించి మరిన్ని వివరాలు నాగేంద్ర నాతో చెప్పారు. ‘‘శ్రీధర్ నిన్ను మోసం చేశాడు. నిన్నే కాదు నా కొడుకు చదివే కాలేజీలో ఉండే అమ్మాయిలు కూడా కంగ్రాట్స్ చెప్పడానికి మెసేజ్ చేస్తే వాళ్లతో కూడా రాంగ్ ట్రాక్ నడిపాడు. డీప్ ఫ్లర్ట్ చేశాడు’’ అని అన్నారు.
నా దగ్గర ఆ కాల్ రికార్డింగ్ ఉంది. అంతేకాదు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయాలని నాకు మెసేజ్ కూడా చేశారు. శ్రీధర్ కూడా అవన్నీ ఫేక్ వీడియోలు అని కౌంటర్ వేశారు. నా సెల్‌ఫోన్‌ను తీసుకుని అందులో ఉన్న ఈ వీడియోలు ఒరిజనల్ అవునో కాదో పోలీసులు పరిశీలిస్తే తేలుతుంది. ఏడాదిన్నరగా బయటకు రాకపోవడానికి కారణం.. ముందు నేను శ్రీధర్ తల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే రూపానంద రెడ్డితో మాట్లాడాను. కానీ నేను ఏం చెప్పినా వారు అతనిని మందలించకుండా, అతనిని కాపాడటం కోసం నన్ను తప్పుపడుతున్నారు. ఎలాంటి విచారణకైనా నేను కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు న్యాయం జరిగే వరకూ పోరాడతాను.
అరెస్టు చేసే దమ్ముందా?
అమ్మా.. హోంమంత్రి అనితమ్మా.. ఈ దారుణమైన మీ కూటమి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ని అరెస్ట్ చేసే దమ్ముందా? లేదా? ఈ బాధితురాలికి న్యాయం చేసే బాధ్యత మీకు ఉందా? లేదా? – వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు
సీఎం, డిప్యూటీ సీఎం నోరు విప్పాలి
రాష్ట్రంలో మహిళలకు, మహిళా ఉద్యోగులకు రక్షణ లేకుండా పోయిందనడానికి కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మహిళా ఉద్యోగినిపై చేసిన లైంగిక దాడి ప్రత్యక్ష నిదర్శనం. దీనిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం సమాధానం చెబుతారు. వారు నోరు విప్పాలి. – పాముల పుష్పశ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం
మహిళలకు రక్షణ లేదు
ఎవరైనా మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అని మాట్లాడిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఒకటి మాత్రం వాస్తవం. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. – విడదల రజిని, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత
అకృత్యాలపై మౌనమేల?
ప్రజాప్రతినిధులే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటే రాష్ట్రంలో ఎంతటి దుస్థితి నెలకొందో చెప్పాల్సిన పనిలేదు. కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అకృత్యాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఎందుకు మౌనంగా ఉన్నారు? – రోజా, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత


