
తమిళ యాక్షన్ స్టార్ విశాల్( Vishal,), యువ నటి సాయి ధన్షిక(Sai Dhanshika)లు తమ పెళ్లి ప్రకటన విడుదల చేశారు. కాబట్టి ఇక వారి గురించి రూమర్స్ మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. కానీ..పుష్కరకాలం దాటిన ఈ జంట స్నేహం, ప్రేమగా విడదీయరాని బంధంగా మార్చిన సందర్భాలేమిటి? అంటే ఓ సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. దీని గురించి వివరాలు తెలియాలంటే.. దాదాపు ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లాలి.
నటుడు–దర్శకుడు టి రాజేందర్ (టిఆర్ అని కూడా పిలుస్తారు) తమిళనాట సీనియర్ సినీ ప్రముఖుడిగా ప్రసిద్ధి చెందారు. ప్రేమసాగరం వంటి చిత్రాల ద్వారా మనకూ గుర్తోస్తారు. వయసు, అనుభవం ఎంత ఉంటే ఏం లాభం? పరిణితి లేనప్పుడు అన్నట్టుగా ఆయన గతంలో నటి సాయి దన్షిక విషయంలో ప్రవర్తించిన తీరు పూర్తిగా ఆక్షేపణకు గురైంది.
తమిళనటులు కృష్ణ, విధర్త్ ప్రధాన పాత్రల్లో నటించిన సాయి ధన్షిక కీలక పాత్ర పోషించిన విజితిరు తమిళ చిత్రం 2017లో థియేటర్లలో వచ్చింది. ఈ చిత్రంలో టి రాజేందర్ అతిధి పాత్రలో నటించారు. విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మాట్లాడిన సాయి ధన్సిక తన ప్రసంగంలో వేదికపై ఉన్న ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పింది. అయితే నటి సాయి ధన్షిక తన పేరు మర్చిపోవడం టి.రాజేందర్‌ను తీవ్ర ఆగ్రహావేశాలకు అసహనానికి గురి చేసింది. దాంతో ఆమెను అదే వేదికపైనే చెడామెడా తిట్టిపోశాడు. ఆమె అప్పట్లో రజనీకాంత్ సినిమాలో (కబాలి) నటిస్తోంది కాబట్టి పొగరు పట్టిందంటూ తీవ్రంగా దుర్భాషలాడాడు.
అయితే ధన్షిక తాను టి రాజేందర్‌ను గౌరవిస్తానని పొరపాటున పేరు మర్చిపోయానని అందుకు క్షమించాలని కోరడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయితే, టిఆర్ మాత్రం ఆగలేదు. తన తిట్ల పరంపరను కొనసాగించాడు పైగా సారీ అంటూ ధన్సిక చెప్పడాన్ని కూడా హేళన చేస్తూ ఆమె శారీ కట్టుకోలేదు కానీ సారీ చెబుతోంది అంటూ వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశాడు. విషాదం ఏమిటంటే ఈ మాటలకు ఆమె సహనటులు సహా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టడం..అవమానాన్ని తట్టుకోవడానికి ప్రయత్నించిన సాయి ధన్సిక, దీంతో తీవ్రంగా చలించిపోయింది. కన్నీటి పర్యంతమైపోతూ దానిని దాచడానికి విఫలయత్నం చేసింది. ఈ ప్రెస్ మీట్ ట్విట్టర్‌లో వైరల్ అయింది.
ఈ కార్యక్రమంలో టి రాజేందర్ విచక్షణా రహిత ప్రవర్తన విషయంలో ధన్షికకు తన సహనటుల నుంచి ఎటువంటి మద్దతు లభించకపోవడాన్ని నెటిజన్లు తీవ్రంగా విమర్శించారు. వేదికపై టిఆర్ ప్రవర్తనను ఖండించకుండా ఆస్వాదించిన మిగిలిన నటులు దర్శకుడు వెంకట్ ప్రభులపై కూడా నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.
ఇది తెలుసుకున్న తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి (టిఎఫ్‌పిసి) అధ్యక్షుడు విశాల్ టి రాజేందర్ ప్రవర్తనను స్పష్టంగా ఖండించాడు ‘ధన్షిక క్షమాపణలు చెప్పినా, మిస్టర్ టిఆర్ ఆమెను లక్ష్యంగా చేసుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను‘ అని విశాల్ అన్నాడు. అప్పటికే క్లోజ్ ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్న సాయి ధన్షిక, విశాల్‌లను ఆ సంఘటన మరింత దగ్గర చేసిందని, వారి బంధం మరింత బలపడిందని అంటారు.