
రాజేంద్రనగర్/మణికొండ/బంజారాహిల్స్: ఆదివారం ఉదయం గుల్జార్‌హౌస్ అగ్నిప్రమాదంలో మృతిచెందిన 17 మందిలో 10 మృతదేహాలకు ఆదివారం సాయంత్రం ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ పెద్ద ప్రహ్లాద్ మోదీ, ఆయన భార్య మున్నీ, కుమారుడు పంకజ్, కోడలు వర్ష, తమ్ముడు రాజేందర్ మోదీ, మరదలు సుమిత్ర, తమ్ముని కుమారుడు అభిషేక్, మనుమలు, మనమరాళ్లు అనుయాన్, ఇదిక, ఐరాజ్‌ల మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం పురానాపూల్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఈ ప్రమాదంలో బంజారాహిల్స్ రోడ్ నెం.3లో నివసించే ఏడేళ్ల బాలిక హర్షాలి గుప్తా కన్నుమూశారు. ఆమె శరీరం పూర్తిగా కాలిపోవటంతో కుటుంబ సభ్యులు అస్తికలకు ఆదివారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
పుట్టింటికి వెళ్లి మృత్యువాత
సనత్‌నగర్: వేసవి సెలవులు కదా..? పిల్లలను తీసుకుని ఇంటికి రా.. తల్లీ! అని ఆ తండ్రి ఆశగా అడగడంతో కొడుకును తీసుకుని తన పుట్టిల్లు అయిన గుల్జార్‌హౌస్‌కు వెళ్లింది. అదృష్టవశాత్తూ తండ్రి పిలుపు మేరకు కొడుకు ముందు రోజు రాత్రే వెళ్లిపోగా, తల్లి అగ్ని ప్రమాదంలో మృత్యువాత పడింది. దీంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. వస్త్ర వ్యాపారి వినోద్‌కుమార్ అగర్వాల్ తన భార్య రజనీ అగర్వాల్ (45), కొడుకు కుషాల్ అగర్వాల్, కుమార్తె తనూలతో కలిసి సనత్‌నగర్‌లో ఉంటున్నాడు. కుమార్తె ముంబైలో ఎంబీఏ చదువుతుండగా, కుమారుడు కుషాల్ ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఈ క్రమంలో కుమారుడు కుషాల్‌ను తీసుకుని రజని గుల్జార్ హౌస్‌కు వెళ్లింది. అయితే కుషాల్ ముందు రోజు రాత్రి ఇంటికి వచ్చేశాడు. అక్కడే ఉన్న రజని మాత్రం ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించింది.
సరదాగా వెళ్లారు.. శవాలై వచ్చారు
రహమత్‌నగర్: బంధువులతో సరదాగా గడపాలని వెళ్లారు. శవాలుగా తిరిగొచ్చారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం ఎర్రగడ్డ డివిజన్ రాజీవ్‌నగర్ బస్తీ వాసులను కలచి వేసింది. గుల్జార్ హౌస్ ఆగ్ని ప్రమాదంలో రాజీవ్‌నగర్‌కు చెందిన తల్లి, కొడుకు, కుమార్తె మృతి చెందారు. ఆటో మొబైల్స్ వ్యాపారం చేసే రాజేష్ జైన్ రాజీవ్‌నగర్‌లో ఉంటున్నారు. ఆయనకు భార్య శీతల్ (35), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కాగా శనివారం ఉదయం శీతల్ తన తండ్రి ఇంటికి పిల్లల్ని తీసుకుని వెళ్లింది. అయితే పెద్ద కుమార్తె రాశి తాను చదువుకోవాలంటూ శనివారం సాయంత్రమే రాజీవ్‌నగర్ లోని తమ నివాసానికి తిరిగి వచ్చింది. అక్కడే ఉండిపోయిన శీతల్, అరుషి, రిషబ్ మాత్రం ప్రమాదంలో చనిపోయారు.