
మే 8న దాడులను విజయవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు
ఆనాటి వివరాలు తాజాగా వెలుగులోకి
అమృత్‌సర్: ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)లోని ఉగ్రస్థావరాలపై భారత దాడులతో వెర్రెక్కిపోయిన పాకిస్తాన్ బలగాలు మే 8వ తేదీన పంజాబ్‌లోని ప్రఖ్యాత స్వర్ణదేవాలయాన్ని కూల్చేందుకు దుస్సాహసం చేశాయని తాజాగా వెల్లడైంది. గోల్డెన్‌టెంపుల్‌పై గగనతల దాడుల వివరాలను తాజాగా భారత ఆర్మీ మేజర్ జనరల్ కార్తీక్ సి.శేషాద్రి బహిర్గతంచేశారు. శేషాద్రి ఆర్మీలోని 15వ ఇన్‌ఫాంట్రీ డివిజన్‌లో జనరల్ ఆఫీసర్ కమాండింగ్(జీఓసీ)గా సేవలందిస్తున్నారు. మే 8వ తేదీన పాక్ జరిపిన దాడులు, ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎలా తుత్తునియలు చేసిందో శేషాద్రి సోమవారం వివరించారు.
ముందే అంచనా వేశాం
‘‘ఆపరేషన్ సిందూర్‌తో అనూహ్య దాడులను చవిచూసిన పాకిస్తాన్ వెంటనే భారత ఆర్మీ బేస్‌లతోపాటు జనావాసాలను లక్ష్యంగా చేసుకుంది. ఇవి చాలవన్నట్లు మత సంబంధ ప్రాంతాలపైనా విరుచుకుపడుతుందని మేం ముందే అంచనావేశాం. ఇందులో సరిహద్దు రాష్ట్రమైన పంజాబ్‌లోని స్వర్ణదేవాలయంపై క్షిపణులు ప్రయోగించే వీలుందని ఊహించాం. వెంటనే గగనతల రక్షణ వ్యవస్థను స్వర్ణదేవాలయం వద్ద మొహరించాం. ఆ ప్రాంత గగనతల రక్షణ వ్యవస్థను శత్రు దుర్బేధ్యంగా మార్చేశాం. ఊహించినట్లే పాకిస్తాన్ మానవరహిత గగనతల ఆయుధాలతో పాక్ స్వర్ణదేవాలయంపైకి దాడులు మొదలెట్టింది.
దూసుకొస్తున్న డ్రోన్లు, క్షిపణులు, చిన్నపాటి అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ)లను భారత ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ గురిచూసి నేలమట్టంచేశారు. స్వర్ణదేవాలయానికి ఒక్క గీత కూడా పడనివ్వలేదు’’అని శేషాద్రి వివరించారు. మరోవైపు స్వర్ణదేవాలయం సహా పంజాబ్‌లోని పలు ప్రాంతాలను ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, ఎల్–70 డిఫెన్స్ గన్స్‌లతో తమ జవాన్లు ఎలా కాపాడారో భారత ఆర్మీ సోమవారం వివరించింది. సంబంధిత ఆయుధ వ్యవస్థల పనితీరును చూపే వీడియోను విడుదలచేసింది.