
కలవరపెట్టిన కరోనా కేసులు
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు
సెన్సెక్స్ 873 పాయింట్ల పతనం
నిఫ్టీ నష్టం 261 పాయింట్లు
ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్లు ఆవిరి
ముంబై: అధిక వెయిటేజీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 873 పాయింట్లు పతనమై 81,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 261పాయింట్లు కోల్పోయి 24,684 వద్ద నిలిచింది. ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆటో, ఫైనాన్స్, రక్షణ రంగ షేర్లలో పెద్ద ఎత్తున అమ్మకాలు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 906 పాయింట్లు క్షీణించి 81,154 వద్ద, నిఫ్టీ 275 పాయింట్లు కోల్పోయి 24,670 వద్ద కనిష్టాన్ని తాకాయి.
⇒ భారీ పతనంతో మంగళవారం ఒక్కరోజే రూ.5.64 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం విలువ రూ.438 లక్షల కోట్లకు దిగివచ్చింది.
⇒ డాలర్ మారకంలో రూపాయి విలువ 16 పైసలు క్షీణించి 85.58 వద్ద స్థిరపడింది.
పతనం ఎందుకంటే...
⇒ ఆపరేషన్ సిందూర్ కాల్పులవిరమణ తర్వాత సూచీలు అనూహ్యంగా 4% లాభపడ్డాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై స్పష్టత కొరవడింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు గరిష్ట స్థాయిల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు.
⇒ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు కలవరపెట్టాయి. భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 257కు చేరింది. వారం రోజుల్లో 164 కేసులు నమోదైనట్లు గణాంకాలు తెలపడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు.
⇒ వరుస కొనుగోళ్ల తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు నికర విక్రేతలుగా మారారు. అనూహ్యంగా మే 19న డీఐఐలూ అమ్మకాలకు పాల్పడ్డారు. మంగళవారం ఎఫ్‌ఐఐలు రూ.10,016 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.