
Photo Courtesy: BCCI
ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. లీగ్‌లో మునుపెన్నడూ జరగని విధంగా ఈ సీజన్‌లో లక్నోకు చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో ఒకే ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు విదేశీ ఆటగాళ్లు 400 పరుగుల మార్కును దాటడం ఇదే మొదటిసారి.
నిన్న (మే 19) సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్ త్రయం ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఈ ఘనత సాధించింది. సీజన్ ప్రారంభం నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ సత్తా చాటారు. ఈ మ్యాచ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. మార్ష్ (61), మార్క్రమ్ (61), పూరన్ (45) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌కు ముందే పూరన్ 400 పరుగులు పూర్తి చేయగా.. మార్క్రమ్, మార్ష్ ఈ మ్యాచ్‌లో 400 పరుగుల మైలురాయిని తాకారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 మ్యాచ్‌లు ఆడిన పూరన్ నాలుగు అర్ద సెంచరీల సాయంతో 455 పరుగులు చేయగా.. మార్ష్ 11 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 443 పరుగులు.. మార్క్రమ్ 12 మ్యాచ్‌ల్లో ఐదు అర్ద సెంచరీల సాయంతో 409 పరుగులు చేశారు. ఈ సీజన్ లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో పూరన్ 9, మార్ష్ 10, మార్క్రమ్ 12 స్థానాల్లో ఉన్నారు.
ఈ సీజన్‌లో ముగ్గురు విదేశీ బ్యాటర్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా లక్నో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోవడం సోచనీయం. నిన్న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్, మార్ష్, మార్క్రమ్ సత్తా చాటినా లక్నో గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో లక్నో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో లక్నో తరఫున ఈ ముగ్గురు మినహా బ్యాటింగ్‌లో ఎవ్వరూ రాణించలేదు. అడపాదడపా బదోని బ్యాట్‌కు పని చెప్పాడు.
మిడిలార్డర్‌లో పంత్ ఘోరంగా విఫలం కావడం.. సరైన్ ఫినిషర్ లేకపోవడం ఈ సీజన్‌లో లక్నో కొంపముంచాయి. బౌలింగ్‌లో ఆవేశ్ ఖాన్, దిగ్వేశ్ రాఠీ పర్వాలేదనిపించినా వీరికి సహకరించే బౌలర్లే కరువయ్యారు. రవి బిష్ణోయ్ ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. పేసర్ ఆకాశ్‌దీప్ తేలిపోయాడు. మరో పేసర్ ప్రిన్స్ యాదవ్ అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకంతా దూరంగా ఉండిన మయాంక్ యాదవ్ రెండు మ్యాచ్‌లు ఆడి తిరిగి గాయపడ్డాడు.
వీటన్నిటికి మించి రిషబ్ కెప్టెన్సీలో లోపాలు ఈ సీజన్‌లో లక్నో ఖేల్ ఖతం చేశాయి. మార్క్రమ్, మార్ష్, పూరన్ ఫామ్ మినహా ఈ సీజన్‌లో లక్నో గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ సీజన్‌లో లక్నోకు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు (మే 22న గుజరాత్‌తో, మే 27న ఆర్సీబీతో) మిగిలి ఉన్నాయి. ఈ మ్యాచ్‌ల్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవడం తప్ప లక్నో చేయగలిగిందేమీ లేదు.