
డిమాండ్లకు విద్యాశాఖ అంగీకారం
నేడు బదిలీ షెడ్యూల్ విడుదల!
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల సర్దుబాటు, బదిలీల అంశంపై విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు సఫలమయ్యాయి. ఉపాధ్యాయులు లేవనెత్తిన కొన్ని డిమాండ్లకు అధికారులు అంగీకరించినట్టు ఉపాధ్యాయుల సంఘాల ఐక్యవేదిక ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల బదిలీలపై బుధవారం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. దీంతో బుధవారం తలపెట్టిన జిల్లా విద్యాశాఖ అధికారుల కార్యాలయాల ముట్టడిని రద్దు చేసినట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెల్లడించారు.
వాస్తవానికి 9 ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సోమవారం జరిగిన చర్చల్లో కీలకమైన డిమాండ్లపై డైరెక్టరేట్ నుంచి సానుకూలత రాకపోవడంతో చర్చలను బహిష్కరించారు. అయితే, మంగళవారం ఉదయం మరోసారి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌తో చర్చలు జరపగా, ఉపాధ్యాయులు సూచించిన కొన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరించినట్టు ఐక్యవేదిక నేతలు వెల్లడించారు.
ప్రభుత్వం అంగీకరించిన అంశాలు ఇవే..
» ఎస్జీటీలకు మాన్యువల్ పద్ధతిలో బదిలీలు
నిర్వహిస్తారు.
» ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తిని 1:49గా మార్చారు. 49 మంది విద్యార్థులు దాటిన తర్వాత రెండో సెక్షన్ ఏర్పాటు చేస్తారు.
» ఫౌండేషన్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 దాటిన తర్వాత రెండో పోస్టు కేటాయిస్తారు.
» ఉన్నత పాఠశాలల్లో నిర్వహించే ప్రాథమిక పాఠశాలలను విడిగా (యూడైస్‌తో సహా) నిర్వహిస్తారు.
» పనిభారం ఎక్కువయ్యే సందర్భంలో ఆయా సబ్జెక్టుల అవసరం మేరకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్/ సర్‌ప్లస్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తారు.
» ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తయిన ఉపాధ్యాయులు వారి సొంత మేనేజ్‌మెంట్‌కు అప్పగింత
» స్టడీ లీవ్‌లో ఉన్న ఉపాధ్యాయుల్లో ఈ ఏడాది ఆగస్టు 31లోపు విధుల్లో చేరేవారి స్థానాలను బదిలీల్లో చూపరు.
» ప్రస్తుత బదిలీల్లో బ్లాకింగ్ విధానం ఉండదు. అన్ని స్థానాలను చూపిస్తారు.
» మోడల్ ప్రాథమిక పాఠశాలల్లో 1,382 మంది ఎస్జీటీలకు పీఎస్ హెచ్‌ఎంగా పదోన్నతి కల్పిస్తారు.
» రెండుసార్లు పునర్విభజన(రీ అపోర్షన్‌మెంట్)కు గురయ్యే ఉపాధ్యాయులకు 7 పాయింట్లు ఇస్తారు.
» ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారానికి జూన్ నెలలో కమిటీ ఏర్పాటు.
» బదిలీల అనంతరం జూలై లేదా ఆగస్టులో ఎంఈవో, ప్రధానోపాధ్యాయుల పరస్పర బదిలీపై నిర్ణయం తీసుకుంటారు.
» మోడల్ ప్రైమరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 120 దాటితే పీఎస్‌హెచ్‌ఎంను అదనంగా (1+5) కేటాయిస్తారు.
» సమాంతర తెలుగు మాధ్యమం అంశంపై విద్యాశాఖ మంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం.
నేడు బదిలీలకు షెడ్యూల్!
ఉపాధ్యాయ సంఘాల సమస్యలు పరిష్కారం కావడంతో బదిలీలకు మార్గం సుగమమైంది. బుధవారం పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. తొలుత ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రకటించి, దానిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ సీనియారిటీ జాబితా విడుదల చేసి స్కూళ్లలో స్థానాల ఎంపికకు (ఆప్షన్స్) అవకాశం కల్పిస్తారు.
తొలుత హెచ్‌ఎంల బదిలీలు చేపడతారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేపడతారు. అనంతరం బదిలీ ఉత్తర్వులు విడుదల చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ జూన్ 2 నాటికి పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.