
ఎల్లో మీడియా శోకాలు పెడుతోంది. అరచి గీపెట్టి మరీ రోదిస్తోంది. దాని బాధల్లా ఒకటే.. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ ఆదాయం బాగానే ఉన్నా సాక్షి మీడియా దాన్ని తక్కువగా చేసి రాసిందీ అని! జగన్ ప్రభుత్వంలో కంటే ఆదాయం ఇప్పుడు ఎక్కువే ఉంటే ఆ మాట నేరుగా చంద్రబాబే ఢంకా బజాయించి మరీ చెప్పుకునేవాడు. ఆయన ఆ పని చేయలేదు కానీ.. ఆయన తరఫున ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ మాత్రం తెగ బాధపడిపోతున్నారు. ఆయనగారి పత్రికలో ఈ మధ్యే ‘సంపదపై శోకాలు’ అంటూ ‘జగన్ పత్రిక రోత రాతలు’ అన్న శీర్షికతో ఒక కథనం ప్రచురితమైంది.
పచ్చి అబద్ధాలతో నిండిన ఇలాంటి కథనాలు నిత్యం వండి వారుస్తున్నందుకే.. వైసీపీ నేతలు.. సామాన్యులు చాలా మంది ఈ పత్రికను చంద్రజ్యోతిగాను, బూతు పత్రికగాను విమర్శిస్తుంటారు.రాధాకృష్ణ కాని, ఆయన సంపాదక బృందం కాని ఒకే ఒక్క ప్రశ్నకు సమాధానం చెబితే అందరం ఆయన కథనాలు సరైనవేనని ఒప్పేసుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే... ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిందేమి? ఆ తరువాత ఏడాది కాలంలో ఆయన చేసిందేమిటి? ‘‘అప్పులు చేయబోను’’, ‘‘సంపద సృష్టి నాకు తెలుసు’’, ‘‘సూపర్ సిక్స్‌తోపాటు ఎన్నికల హామీలన్నీ అమలు చేసి చూపిస్తా’’ అని ఎన్నికల ముందుకు ఒకటికి పదిసార్లు హామీ ఇచ్చిన ఆ పెద్దమనిషి అధికారంలోకి వచ్చిన తరువాత.. ‘‘గల్లా పెట్టె ఖాళీగా కనబడుస్తా ఉంది’’, ‘‘అప్పులు పుట్టడం లేదు’’ ‘‘సంపద సృష్టించే మార్గముంటే చెవిలో చెప్పండి’’. ‘‘అప్పులు చేసి సంక్షేమానికి ఖర్చు చేయలేను’’ అని ప్లేటు ఫిరాయించిన విషయం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. రాధాకృష్ణ భాషలో వీటిని శోకాలు అంటారా? లేదా? ఆయన రాసినట్లే చంద్రబాబు హయాంలో ఆదాయం ఎక్కువ ఉందని కాసేపు అనుకుందాం.
అలాంటప్పుడు చంద్రబాబు ఖజానా ఖాళీగా కనబడుతోంది అని ఎందుకు అన్నట్టు? పైగా.. అప్పుల కోసం ఏకంగా ఖజానానే తనఖా పెట్టి చరిత్ర సృష్టించడం ఎందుకు? అప్పులు పుట్టడం లేదన్న బాబు మాట కూడా నిజమే అయితే ఏడాది కాలంలో రూ.1.5 లక్షల కోట్ల రుణం చేసిన రికార్డు మాటేమిటి? జగన్ హయాంలో ఆదాయం తక్కువగా ఉందనుకున్నా.. సంక్షేమ పథకాలన్నీ ఐదేళ్లూ చక్కగా అమలు చేశారు కదా? దానికి సమాధానం ఏమిటి? ఓడరేవులు, మెడికల్ కాలేజీలు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, పాఠశాలల్లో ‘నాడు-నేడు’’ ఇలా బోలెడంత అభివృద్ధినికి ప్రజల కళ్లముందే నిలిపారు కదా? అయినా సరే.. జగన్ ఎప్పుడు బీద అరుపులు అరవలేదే?
ఒకపక్క చంద్రబాబేమో ఖజానా ఖాళీ అంటారు.. ఇంకోపక్క రాధాకృష్ణ ఆదాయం భేష్ అంటారు. ఏది నిజం? ఈ ప్రశ్నకు సమాధానం కాగ్ లెక్కల్లో వెతుకుదాం.. జగన్ పాలన చివరి ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడులు మొత్తం సుమారు రూ.1.74 లక్షల కోట్లు. ఆ తరువాత చంద్రబాబు (Chandrababu) పాలనలో తొలి ఏడాది (2024-2025) రూ.1.68 లక్షల కోట్లు! అయితే... ఆంధ్రజ్యోతి 2014-15కు సంబంధించిన రెవెన్యూ లోటు మొత్తాన్ని కేంద్రం 2023-24లో ఇవ్వడం వల్ల జగన్ హయాంలోని ఆదాయం ఎక్కువగా కనిపిస్తోందని అంటోంది.
ఇదే నిజం అనుకుందాం. అప్పుడు కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను సమర్థంగా రాబట్టడంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించినట్లే అవుతుంది కదా? ఐదేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్నా పది వేల కోట్ల రూపాయల మొత్తం కూడా కేంద్రం నుంచి రాబట్టుకోలేని అసహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్లు రాధాకృష్ణ ఒప్పుకున్నట్లేనా? జగన్ ప్రభుత్వం 12వ ఆర్థిక సంఘం నిధులను కూడా రాబట్టుకుందని ఆంధ్రజ్యోతి చెబుతోంది. ఇది కూడా జగన్ గొప్పదనమే అవుతుంది కదా! ఈ స్థాయిలో కేంద్రం నుంచి చంద్రబాబు నిధులు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఈ రెండింటినీ మినహాయిస్తే జగన్ హయాం చివరి ఏడాది వచ్చిన రాబడి రూ.1.61 లక్షల కోట్లేనని, చంద్రబాబు తన తొలి ఏడాదిలో ఆదాయం రూ.1.68 లక్షల కోట్లు అని ఈ పత్రిక తెలిపింది.
అలాంటప్పుడు చంద్రబాబు పదే, పదే ఎందుకు డబ్బులు లేవని వాపోతున్నారు? రూ.1.5 లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు? ఈ మొత్తాన్ని ఎందుకోసం ఖర్చు చేశారు? జగన్ టైమ్ నాటికన్నా పదివేల కోట్లు ఎక్కువగా పన్ను ఆదాయం చంద్రబాబు ప్రభుత్వం పొందిందని ఎల్లో మీడియా చెబుతోంది. ఇదే నిజమైతే బాబు బీద అరుపుల మతలబు ఏమిటి? జీఎస్టీ వసూళ్లు రూ.2850 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం రూ.3900 కోట్లు, కేంద్ర పన్నుల వాట రూ.ఐదు వేల కోట్ల మేర ఎక్కువ వచ్చిందని ఈ పత్రిక రాసింది. ఇంత భారీ ఎత్తున ఆదాయం వచ్చినా ఎందుకు ఒక్క స్కీమ్ అమలు చేయడం లేదు?
జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.9542 కోట్లు వచ్చినట్లు కాగ్ లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో తొలి ఏడాది ఈ మొత్తం రూ.8837 కోట్లే! దీని అర్థం బాబు హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గినట్లే కదా? అమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం మొదలైన వాటి పరిస్థితి కూడా ఇలాగే ఉందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. జగన్ హయాంతో పోలిస్తే ఇప్పుడు రెవెన్యూ, ద్రవ్య లోటులు రెండూ సుమారు రూ.20 వేల కోట్లు ఎక్కువన్నది కూడా వాస్తవమే కదా? రాధాకృష్ణ ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దామని ప్రయత్నించి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లుగా ఉంది.
ఆయన రాసింది వాస్తవమైతే చంద్రబాబు అబద్దాలు చెబుతున్నట్లు అవుతుంది. పైగా ఆదాయం బాగున్నా.. రూ.1.5 లక్షల కోట్లు అప్పు తెచ్చినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. ఖజానా ఖాళీ అన్న చంద్రబాబు మాటలు నిజమైతే ఈ జాకీ పత్రిక రాసింది అవాస్తవమని అంగీకరించవలసి ఉంటుంది. ఏతావాతా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శోకాలకు చంద్రబాబు సర్కారే బద్నాం అయ్యింది. కూటమి ప్రభుత్వానికి భజన చేద్దామని అనుకుని ఇలాంటి పిచ్చి రాతలు రాసి చంద్రబాబునే డిఫెన్స్ లో నెట్టేసినట్లయింది. ఆ విషయం అర్థమైందా?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత