
యశవంతపుర: ఓ ప్రొఫెసర్ ప్రేమ పురాణం యువ ఇంజినీరును బలిగొన్నట్లు తేలింది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థళకు చెందిన ఏరోనాటిక్స్ ఇంజినీరు ఆకాంక్ష ఎస్ నాయర్ (23) ప్రేమ వైఫల్యం కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఈ నెల 17న ఆమె పంజాబ్‌లో జలంధర్ వద్ద పగ్వారలో ఎల్‌పీయూ విద్యాసంస్థలో నాలుగో అంతస్తు నుంచి కిందపడి చనిపోయారు.
అక్కడి పోలీసుల విచారణలో పలు విషయాలు తెలిశాయి. అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కేరళ కొట్టాయంవాసి బిజిల్ మ్యాథ్యూతో ప్రేమలో పడిందని, అతనికి ఇదివరకే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. అతని ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని అడిగింది. అతడు తిరస్కరించి కాలేజీకి వచ్చాడు.
మళ్లీ అక్కడకు వచ్చిన ఆకాంక్ష మ్యాథ్యూతో గొడవ పడింది, పెళ్లి చేసుకోనని అతడు తెగేసి చెప్పడంతో మోసపోయానని బాధపడింది, అక్కడే నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చావుకు కారణమయ్యాడని మ్యాథ్యూపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఆమె భౌతికకాయాన్ని ఇంటికి తీసుకువచ్చారు. దారి తప్పిన ప్రేమ ఎంతపని చేసిందని బంధుమిత్రులు శోకంలో మునిగిపోయారు.
ఏరో ఇంజినీర్ అనుమానాస్పద మృతి