
పంజాబ్‌లో సంఘటన
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన విద్యావంతురాలి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ధర్మస్థలం నివాసి అయిన ఏరోస్పేస్ ఇంజినీర్ పంజాబ్‌లో అనుమానాస్పద రీతిలో చనిపోయింది.
ఆకాంక్ష (23) మృతురాలు. ధర్మస్థలంలోని బోళియార్ నివాసులైన సురేంద్ర, సింధూదేవి దంపతుల కుమార్తె ఆకాంక్ష, పంజాబ్‌లోని ఫగ్వాడాలో ఎల్‌పీయూ విద్యాసంస్థలో ఉన్నత విద్యను పూర్తి చేసి, 6 నెలల నుంచి ఢిల్లీలో ఏరోస్పేస్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తోంది. తరువాత జపాన్‌లో ఉద్యోగం సంపాదించుకున్న ఆకాంక్ష తాను చదివిన కాలేజీలో కొన్ని సర్టిఫికెట్లు పొందడానికి పంజాబ్‌కు వెళ్లింది.
శనివారం మధ్యాహ్నం సర్టిఫికెట్లు తీసుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. జలంధర్ నగరంలో ఉన్నట్లు తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఓ భవనంలో 3వ అంతస్తు పడి దుర్మరణం చెందింది. స్థానిక పోలీసులు ఆ మేరకు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే తల్లిదండ్రులు పంజాబ్‌కు వెళ్లారు. ఏదో దారుణం జరిగిందని, ఇది ప్రమాదం కాదని తల్లిదండ్రులు వాపోయారు.