
సాక్షి,గుంటూరు: తిరువూరు మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అరగంటలో భద్రతా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. డీసీపీ స్థాయి అధికారితో కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని సూచించింది.
తిరువూరు మున్సిపల్ ఎన్నికపై వైఎస్సార్‌సీపీ ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించాలని పేర్కొంది.
వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై మంగళవారం (మే20) ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను పోలీసులు పాటించడం లేదంటూ వైఎస్సార్‌సీపీ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు భద్రత కల్పించడమే కాదు, తక్షణమే ప్రశాంత ఎన్నికలకు చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా, తిరువూరు మున్సిపల్ ఎన్నిక నేపథ్యంలో నేటి ఉదయం నుండి టీడీపీ నేతలు తిరువూరులో అరాచకం సృష్టిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను ఎన్నికలకు రాకుండా అడ్డుకునేందుకు కుట్రలకు పాల్పడింది. తిరువూరు వెళ్లే వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అరగంటలో డీసీపీ స్థాయి అధికారితో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు భద్రతకు కల్పించాలని రాష్ట్ర హైకోర్టు పోలీసుల్ని ఆదేశించింది. అంతేకాదు, భద్రతా ఏర్పాట్లు ఎవరు సమీక్షిస్తున్నారో అరగంటలో చెప్పాలని తెలిపింది.
డీసీపీ మహేశ్వరరాజుకు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతలు
తిరువూరు ఉప ఎన్నికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల రక్షణ బాధ్యతల్ని డీసీపీ మహేశ్వరరాజుకు అప్పగించింది. ఎన్నిక పూర్తయ్యేంత వరకు రక్షణ కల్పించాలని ఆదేశించింది. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎక్కడ ఉన్నారో అక్కడి నుంచి పూర్తిస్థాయి భద్రతతో ఎన్నికల హాలుకు తీసుకెళ్లాలని సూచించింది. ఎన్నిక పూర్తయ్తేంతవరకు మహేశ్వరరాజుదే బాధ్యత హైకోర్టు చెప్పింది.