
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ కూడా చర్చించారు.
ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్‌స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు.
ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్‌స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.