
శరీరానికి ప్రాణం పోసేది శ్వాస. శ్వాస ఆగిపోతే జీవితం ఆగిపోయినట్టే. అందుకే రోజువారీ దినచర్యలో శ్వాసను నియంత్రించడం చాలా అవసరమని యోగ చెబుతోంది. సంస్కృతంలో, "ప్రాణ" అంటే ప్రాణశక్తి లేదా శక్తి, " యమ" అంటే నియంత్రణ. యోగాలో ప్రాణాయామం ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఆయువును పొడిగించే ఆసనాన్నే ప్రాణాయామం అని చెప్తారు. మనస్సును నియంత్రించడానికి అనుసరించే అత్యంత ముఖ్యమైన పద్ధతుల్లో ఇది ఒకటి. మనిషి ఎక్కువ కాలం జీవించడానికి ప్రాణాయామం సహాయపడుతుంది. ప్రాణాయామం లేదా శ్వాస నియంత్రణ, అనేక శారీరక, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. మొత్తం ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
శరీరంలోని అన్ని వ్యవస్థలకు ఆక్సిజన్ అందించి అన్నింటినీ సక్రమంగా నడిపించే ప్రక్రియ శ్వాసక్రియ. అన్ని కణాలకు, శరీర వ్యవస్థలకు ఆక్సిజన్ సరఫరా జరగాలంటే శ్వాస మెరుగ్గా ఉండాలని, యోగా ద్వారా శ్వాసను నియంత్రించడం సాధ్యమని యోగా నిపుణులు చెబుతారు. మనసును అదుపులో ఉంచడం, ఏకాగ్రతను సాధించడం అనేవి నాడీవ్యవస్థకు సంబంధించినవి. ఇందులో అత్యంత కీలకమైన దశ శ్వాస.
ప్రాణాయామంతో మనస్సు, శరీరం రీఛార్జ్
యోగాలో ప్రాణాయామం ప్రయోజనాలు యోగాకు మించి ఉంటాయి. శ్వాస మీద పని చేస్తున్నప్పుడు, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తూనే తగినంత ఆక్సిజన్ సరఫరాతో శ్వాసను నియంత్రించడం, సరైన విధంగా సాధన చేయడం ఈ యోగాలో కీలకం. శరీరాన్ని రీఛార్జ్ చేయడం ద్వారా ఇది పనిచేస్తుంది ప్రాణాయామం జీర్ణాశయానికి ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది, మెరుగైన జీర్ణక్రియ కోసం రక్త ప్రవాహాన్ని, ప్రేగుల బలాన్ని పెంచుతుంది. యోగా ఆసనాలతో కలిపి చేసే ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తుంది. జీవక్రియ వ్యర్థాలను తొలగిస్తుంది.
సాధన చేయడానికి... ప్రాణాయామం చేయడానికి, ఒక ప్రశాంతమైన స్థానంలో కూర్చొని, వెన్నును నిటారుగా ఉంచాలి. రెండు కళ్ళను మూసి, శ్వాసను లోపలికి పీల్చుకోవాలి. కొన్ని క్షణాలు ఆ శ్వాసను బిగించి, తర్వాత నెమ్మదిగా బయటకు వదిలేయాలి. ఈ ప్రక్రియను పదే పదే పునరావృతం చేయడం వల్ల శరీరానికి, మనసుకు ప్రశాంతత చేకూరి శక్తిమంతం అవుతాయి. శ్వాస సాధన ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ప్రాణాయామంలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. ప్రధానంగా ఐదు ప్రాణాయామాలు ఉన్నాయి.
- అనులోమ విలోమ ప్రాణాయామం
- కపాలభాతి ప్రాణాయామం
- భ్రమరి ప్రాణాయామం
- ఉజ్జయి ప్రాణాయామం
- దిర్గ ప్రాణాయామం