
వాటి ఆధారంగా పార్టీ ముందుకెళ్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి
వ్యవహారశైలి మార్చుకోవాల్సిన వారు వెంటనే మారితే మంచిది
మీ అవసరాలు, బాధలు కూడా వినేందుకు సిద్ధంగా ఉన్నా
నాగర్‌కర్నూల్, మెదక్, మల్కాజ్‌గిరి పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా మీ ఆలోచనలేంటో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్యేలకు ఉన్న ప్రజాసంబంధ అవసరాలు, బాధలు వినేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖిలో భాగంగా మంగళవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆయన నాగర్‌కర్నూల్, మెదక్, మల్కాజ్‌గిరి పరిధిలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. అయితే, గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో ఎమ్మెల్యేతో విడివిడిగా భేటీ అయినట్టు తెలిసింది. ప్రతీ ఎమ్మెల్యేతో 10–15 నిమిషాలపాటు మాట్లాడిన రేవంత్.. ఎమ్మెల్యేల అభిప్రాయాలను వినడంతోపాటు వారికి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం... ముఖాముఖి భేటీలో భాగంగా వారి పనితీరు గురించి రేవంత్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎవరి పనితీరు ఏంటో తన దగ్గర ఉన్న నివేదికలు చెబుతున్నాయని, ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో, ఎవరు ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నారో తనకు తెలుసునని, పనితీరు మార్చుకోవాల్సిన వారు వెంటనే మారితే మంచిదని, లేదంటే తాను కూడా ఏమీ చేయలేనని హెచ్చరించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు వస్తాయని, ఆ నివేదికల ఆధారంగానే పార్టీ ముందుకెళ్తుందని కూడా చెప్పినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ తీర్చే బాధ్యత తనపై ఉందని, ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని ఎమ్మెల్యేలకు చెప్పారు.
నియోజకవర్గాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకురావాలని, కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యే తనకు సమానమేనని, అందరికీ తగిన ప్రాధాన్యత ఉంటుందన్నారు. నల్లమల డిక్లరేషన్ సహా అన్నింటినీ అమలు చేస్తానని చెప్పారు. ఒక్కసారి గెలవడం గొప్ప కాదని, రెండోసారి, మూడోసారి గెలిచేలా ప్రజలను ఆకట్టుకోవడంలోనే ఎమ్మెల్యేల పనితీరు తెలుస్తుందని, రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అసలు రాజకీయం ఏంటో అర్థమవుతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. సీఎంతో భేటీ అయిన వారిలో వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, గద్వాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఉన్నారు. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ అమెరికా పర్యటనలో ఉండటంతో భేటీలో పాల్గొనలేదు.