
వాషింగ్టన్: కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్‌స్కీ ఇందుకు అంగీకరించినట్టు వెల్లడించారు. చర్చల విధి విధానాలను ఆ దేశాలే నిర్ణయించుకుంటాయని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం జెలెన్‌స్కీతోనూ చర్చించారు.
‘‘యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ అభిలషించారు. అందుకు నేను సరేనన్నాను’’ అని చెప్పుకొచ్చారు. తద్వారా ఉక్రెయిన్ కూడా భారీగా లబ్ధి పొందుతుందని అభిప్రాయపడ్డారు. యుద్ధానికి తెర దించడంపై పుతిన్, ట్రంప్ మధ్య ఇది మూడో ఫోన్ సంభాషణ కావడం విశేషం! చర్చల వివరాలను జెలెన్‌స్కీతో పాటు యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ తదితర దేశాధినేతలతో పంచుకున్నట్టు అధ్యక్షుడు వివరించారు.