
5న విచారణకు హాజరుకావాలన్న పీసీ ఘోష్ కమిషన్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై విచారణ జరుపుతున్న కమిషన్
మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌కు కూడా నోటీసులు
6న హరీశ్, 9న ఈటల రావాలని పిలుపు
వ్యక్తిగతంగా హాజరు కావాలని సూచన.. వారు కోరితే వర్చువల్‌గా విచారించేందుకూ అవకాశం
సహజ న్యాయసూత్రాల మేరకు వారి వాదనలు వినాలని నిర్ణయించిన కమిషన్
తుది నివేదికలో చేర్చే యోచన
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న విచారణలో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు, ఇతరులను కమిషన్ విచారించింది. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసింది.
జూన్ 5వ తేదీన విచారణకు హాజరుకావాలని తెలిపింది. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రులుగా పనిచేసిన హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌లకు సైతం నోటీసులు ఇచి్చంది. ముగ్గురికీ వేర్వేరుగా మూడు పేజీలున్న నోటీసులను మెసెంజర్ ద్వారా అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపింది. వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని సూచించింది. జూన్ 6న హాజరుకావాలని హరీశ్‌రావుకు, 9వ తేదీన రమ్మని ఈటల రాజేందర్‌కు తెలిపింది.
ఇప్పటికే పలువురి విచారణ పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమానిస్తున్న ప్రభుత్వం, సమగ్ర విచారణ జరిపి నివేదిక సమరి్పంచేందుకు గత ఏడాది మార్చిలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించింది. బరాజ్‌ల నాణ్యతపై కూడా విచారించాలని సూచించింది. దీనిపై దాదాపుగా విచారణ పూర్తి చేసిన కమిషన్, రెండుమూడు రోజుల్లో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోందని భావిస్తున్న తరుణంలో.. కమిషన్ గడువును మరో రెండు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో సహజ న్యాయ సూత్రాల మేరకు ఈ ముగ్గురి వాదనలు సైతం వినాలని జస్టిస్ ఘోష్ నిర్ణయించినట్లు సమాచారం. కాళేశ్వరం నిర్మాణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌లను ప్రశ్నించి మరింత సమాచారం జోడిస్తే సమగ్ర నివేదిక ఇచ్చినట్లు అవుతుందని భావించిన కమిషన్ వారికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 సెక్షన్ 311ను అనుసరించి నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ఇదివరకే పలువురు ఇంజనీర్లు, నిర్మాణదారులు, అప్పట్లో నీటిపారుదల శాఖ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులను విచారించిన సంగతి విదితమే.
2019లో బరాజ్‌ల నిర్మాణం పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడు బరాజ్‌ల నిర్మాణ పనులు 2016లో ప్రారంభించగా 2019 మేలో పూర్తయ్యాయి. అయితే 2023 సెపె్టంబర్‌లో మేడిగడ్డ బరాజ్‌లోని ఒక బ్లాక్ పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇప్పటికే నివేదిక ఇచి్చంది. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో మొదటి దఫాలో హరీశ్‌రావు నీటిపారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. రెండో దఫాలో కేసీఆర్ సీఎంగా, నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించగా.. హరీశ్‌రావు ఆర్థిక మంత్రిగా కొనసాగారు.
ప్రాజెక్టు డిజైన్లు, నిర్మాణం తదితర అంశాల్లో వీరి నిర్ణయాలు కీలకంగా ఉన్నాయనే ఉద్దేశంతో, వారిని విచారించి వాదనలు రికార్డు చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. నోటీసుల ప్రకారం వారంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఒకవేళ వారు కోరితే వర్చువల్‌గా కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నట్టు కమిషన్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ
పీసీ ఘోష్ కమిషన్ నోటీసుల నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. నోటీసులు, తదుపరి పరిణామాలు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు 20 నిమిషాల పాటు కొనసాగగా.. కేసీఆర్, హరీశ్‌రావు విచారణకు హాజరవుతారా? లేదా సమయం కోరతారా అన్న అంశంలో స్పష్టత రాలేదు.