
క్యూ4లో రూ. 5,284 కోట్లు
న్యూఢిల్లీ: మెటల్ రంగ ఆదిత్య బిర్లా గ్రూప్ దిగ్గజం హిందాల్కో ఇండస్ట్రీస్ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 66 శాతం జంప్‌చేసి రూ. 5,284 కోట్లను తాకింది. దేశీ అమ్మకాలు పుంజుకోవడం, ముడివ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో కేవలం రూ. 3,174 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 55,994 కోట్ల నుంచి రూ. 64,890 కోట్లకు ఎగసింది. కాగా.. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం రూ. 10,155 కోట్ల నుంచి రూ. 16,002 కోట్లకు జంప్ చేసింది. మొత్తం ఆదాయం రూ. 2,15,962 కోట్ల నుంచి రూ. 2,38,496 కోట్లకు బలపడింది.
ఈఎంఐఎల్ మైన్స్‌కు ఓకే
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినట్లు హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ పేర్కొన్నారు. ఇందుకు నిలకడైన నిర్వహణ సామర్థ్యం, వ్యయ నియంత్రణకుతోడు అన్ని బిజినెస్‌లకు నెలకొన్న డిమాండ్ దోహదపడినట్లు తెలియజేశారు. ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ సొంత అనుబంధ సంస్థ ఈఎంఐఎల్ మైన్స్ మినరల్ రిసోర్సెస్ కొనుగోలుకి బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు హిందాల్కో పేర్కొంది. బంధా కోల్ బ్లాకు లీజ్ హక్కులు కలిగిన ఈఎంఐఎల్ మైన్స్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు వెల్లడించింది.
హిందాల్కో షేరు బీఎస్‌ఈలో 0.7% బలపడి రూ. 663 వద్ద ముగిసింది.