
న్యూయార్క్: దేశీ పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తాజాగా యూఎస్–ఇండియా స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరం (యూఎస్‌ఐఎస్‌పీఎఫ్) డైరెక్టర్ల బోర్డులో చేరారు. వ్యాపార రంగంలో అగ్రగామిగా నిలుస్తూ, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతమయ్యేందుకు కృషి చేస్తున్నందుకు గాను గత నెలలో వాషింగ్టన్ డీసీలో జరిగిన లీడర్‌షిప్ సదస్సు 2025లో ఆయన గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డును అందుకున్నారు.
స్వల్ప వ్యవధిలోనే భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక, ఆర్థిక బంధాలను పటిష్టం చేయడంలో యూఎస్‌ఐఎస్‌పీఎఫ్ బలమైన శక్తిగా ఎదిగిందని బిర్లా తెలిపారు. తమ సంస్థ అమెరికాలో అతి పెద్ద భారతీయ ఇన్వెస్టరుగా కార్యకలాపాలు సాగిస్తోందని, మరింతగా పెట్టుబడులను పెంచే ప్రణాళికలు ఉన్నాయని ఆయన వివరించారు. అమెరికాలో ఆదిత్య బిర్లా గ్రూప్ 15 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. మెటల్స్, కార్బన్ బ్లాక్, రసాయనాలు తదితర రంగాల్లో 15 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. దాని అనుబంధ సంస్థ అయిన నోవెలిస్ ప్రపంచంలోనే అతి పెద్ద అల్యుమినియం రీసెక్లింగ్ కంపెనీ.