ఉగ్రవాదంపై ఉక్కుపాదాలై... | Anti-Terrorism Day On May 21 | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదంపై ఉక్కుపాదాలై...

May 21 2025 12:06 AM | Updated on May 21 2025 12:06 AM

Anti-Terrorism Day On May 21

నేడు యాంటీ–టెర్రరిజం డే

నేడు యాంటీ–టెర్రరిజం డే
ఉన్మాదం తలకెక్కిన ఉగ్రవాదానికి... ఆమె ధైర్యం... ఉక్కుపాదం. ఆమె సాహసం... రక్తం రుచి మరిగిన నరరూప రాక్షలసుల పాలిట వజ్రాయుధం. ఉగ్రవాదం పీచమణచడంలో వివిధ స్థాయులలో, విభాగాలలో ఎంతోమంది మహిళా సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నారు...

‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భారత సైన్యంలోని ఉమెన్‌ ఆఫీసర్‌లు మేల్‌ ఆఫీసర్‌లతో సరిసాటిగా కాల్పులు, మిస్సైల్‌ ప్రయోగాలలో తమ సత్తా చాటారు. శత్రువులకు దడ పుట్టించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పాల్గొన్న  సిగ్నల్స్‌ రెజిమెంట్‌కి చెందిన ఒక మహిళా అధికారి (పేరు వెల్లడి చేయలేదు) తన అనుభవాలను పంచుకున్నారు. ఆమె, ఆమె టీమ్‌ గ్రౌండ్‌లోనే కాకుండా ఎయిర్‌లో కూడా కమ్యూనికేషన్స్‌ని హ్యాండిల్‌ చేశారు.

‘ఏ యుద్ధంలో అయినా కమ్యూనికేషన్‌ అనేది చాలా కీలకం. నేను ఈ ఆపరేషన్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. మా టాస్క్‌లన్నీ అంకితభావంతో పూర్తి చేశాం. గ్రౌండ్‌ మీద లేదా ఎయిర్‌లో కాన్‌ఫ్లిక్ట్‌ని వీడియో గ్రాఫ్‌  చేయడంలో కమ్యూనికేషన్‌కి సంబంధించిన అన్ని అంశాలనీ చూసుకున్నాం’ అన్నారు. ‘విధి నిర్వహణలో పురుష అధికారులకు, మహిళ ఆఫీసర్‌లకూ తేడా ఉంటుందా?’ అనే ప్రశ్నకు... ‘ఫ్రంట్‌లైన్‌లో స్త్రీలు, పురుషులకు ఒకేరకమైన విధి నిర్వహణ ఉంటుంది. అందరినీ ఒకేరకంగా చూస్తారు. మహిళలుగా మేము ప్రత్యేక సౌకర్యాలని కోరుకోలేదు. ఎందుకంటే మేము దేశం కోసం యుద్ధం చేస్తున్నాం’ అంటారు ఉమన్‌ ఆఫీసర్‌.

ఆమె భర్త ఆర్మీలో సిగ్నల్స్‌ ఆఫీసర్‌గా పనిచేసేవారు ‘ఆపరేషన్‌ రైనో’ సమయంలో ఆయన అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించారు. ఉల్ఫా ఉగ్రవాదుల ఏరివేతకు అస్సాం–అరుణాచల్‌ద్రేశ్‌ సరిహద్దులలోని దట్టమైన అడవుల్లో ‘ఆపరేషన్‌ రైనో’ మెరుపుదాడిలా మొదలైంది. ఎన్నో ప్రతికూల పరిస్థితుల మధ్య ఉగ్రవాదులతో పోరాడడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఏ మూల నుంచి అయినా మృత్యువు పొంచి ఉండవచ్చు. ‘ఆపరేషన్‌ రైనో’కి సంబంధించి ఎన్నో జ్ఞాపకాలు ఆ ఉమన్‌ ఆఫీసర్‌ మది నిండా ఉన్నాయి. అయితే ఏ జ్ఞాపకమూ ఆమెను వెనక్కి లాగలేదు. ‘సాధారణ జీవితమే మేలు’ అనుకునేలా చేయలేదు.

భర్తకు సంబంధించిన ప్రతి జ్ఞాపకం... యుద్ధరంగంలో ముందడుగు వేయడానికి అవసరమై శక్తిని ఇచ్చాయి. ‘భారత సైన్యంలోకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఏమిటి?’ అనే ప్రశ్నకు జవాబుగా ‘నా భర్త ఇండియన్‌ ఆర్మీలో సిగ్నల్స్‌ కార్ప్‌లో పనిచేసేవారు. నా భర్త చేసిన త్యాగమే నన్ను ఆర్మీలో చేరేలా చేసింది’ అని చెప్పారు. 
ఆర్మీలో చేరాలనే ఆకాంక్ష ఆమెతోనే ఆగిపోలేదు. ఆమె కొడుకు కూడా ఆర్మీలో చేరాలనుకుంటున్నాడు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు. కొన్ని కుటుంబాల్లో వ్యక్తులు కనిపించరు. దేశం కనిపిస్తుంది... అలాంటి అరుదైన ఒక కుటుంబ ఈ ఉమెన్‌ ఆఫీసర్‌ది.

ఆల్‌–ఉమెన్‌ కమాండో టీమ్‌
కొత్త సెక్యూరిటీ బ్లూప్రింట్‌లో భాగంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో యాంటి టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌)లో తొలిసారిగా ఆల్‌–ఉమెన్‌ కమాండో టీమ్‌ ప్రారంభించారు. 36 మంది ఉమెన్‌ కమాండోలతో ఈ టీమ్‌ మొదలైంది. విధానసభ, రాజ్‌ భవన్, క్రికెట్‌ స్టేడియం, ముఖ్యమంత్రి నివాసంలాంటి ప్రాంతాల రక్షణకు వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అన్ని రకాల ఆయుధాలను హ్యాండిల్‌ చేయడంలో శిక్షణ ఇచ్చారు. ఇజ్రాయెల్‌ అన్‌ఆర్మ్‌డ్‌ కంబాట్‌ టెక్నిక్‌లో కూడా తర్ఫీదు ఇచ్చారు. ఆల్‌–ఉమెన్‌ కమాండో టీమ్‌కు ఎంపికైన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్న పట్టణమైన బులంద్‌షహర్‌కు చెందిన చంచల్‌ తెవోటియా యాంటి–టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌లో అత్యంత పిన్న వయస్కురాలు. తక్కువగా మాట్లాడే ఈ అమ్మాయి మాక్‌ డ్రిల్‌లో సత్తా చాటింది.    

గరుడ–యాంటీ టెర్రర్‌ ఫోర్స్‌
‘గరుడ’ అనేది కర్ణాటక రాష్ట్ర యాంటీ–టెర్రర్‌ ఫోర్స్‌. ఈ స్పెషల్‌ ఆపరేషనల్‌ టీమ్‌లో కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదహారుమంది యువతులు ఉన్నారు. వీరికి ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో, ఆయుధాలు చేపట్టడంలో శిక్షణ ఇచ్చారు. పోలీసర్‌ ఆఫీసర్‌ మధుర వీణ ఆధ్వర్యంలో ఈ ఫోర్స్‌ పనిచేస్తుంది. ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ప్రధానంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారుల మాటల్లో చెప్పాలంటే... ఇది సాధారణమైన ట్రైనింగ్‌ కాదు. ట్రైనింగ్‌ పూర్తి చేసిన తరువాత ఒక ఉమెన్‌ కమాండో ఆయుధాలతో ఉన్న ముగ్గురు నలుగురితో పోరాడే శక్తిని కలిగి ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement