
క్వాలిఫయింగ్‌లో రెండు విజయాలు
మెయిన్ ‘డ్రా’కు అర్హత
తరుణ్, శంకర్‌లకు నిరాశ
కౌలాలంపూర్: ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత అగ్రశ్రేణి షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం మొదలైన మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీలో శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన శ్రీకాంత్ మెయిన్ ‘డ్రా’లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 65వ స్థానంలో ఉన్న శ్రీకాంత్ తొలి రౌండ్‌లో 21–8, 21–13తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ)పై గెలుపొందాడు.
అనంతరం రెండో రౌండ్‌లో 9–21, 21–12, 21–6తో హువాంగ్ యి కాయ్ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి ప్రవేశించాడు. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో ఆరో సీడ్, చైనా ప్లేయర్ లు గ్వాంగ్ జుతో శ్రీకాంత్ తలపడతాడు. 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం నెగ్గిన 32 ఏళ్ల శ్రీకాంత్ ఈ ఏడాది ఎనిమిది టోర్నీల్లో ఆడినా ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు.
మరోవైపు గతవారం థాయ్‌లాండ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్ వరకు దూసుకెళ్లిన హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ మన్నెపల్లికి ఈ టోర్నీలో నిరాశ ఎదురైంది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లోనే తరుణ్ వెనుదిరిగాడు. తరుణ్ 13–21, 21–23తో పనిత్‌చఫోన్ తీరారత్‌సకుల్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. భారత్‌కే చెందిన మరో ప్లేయర్ శంకర్ ముత్తుస్వామి 20–22, 20–22తో జు జువాన్ చెన్ (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.
మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ అన్‌మోల్ ఖరబ్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లోనే ని్రష్కమించింది. అన్‌మోల్ 14–21, 18–21తో హుంగ్ యి టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. మిక్స్‌డ్ డబుల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో మోహిత్–లక్షిత జగ్లాన్ ద్వయం 15–21, 16–21తో మింగ్ యాప్ టూ–లీ యు షాన్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. అన్ని విభాగాల్లో మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు నేడు మొదలవుతాయి.