
ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సతీష్ కత్తులకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్‌షిప్ అవార్డు-2025 వరించింది. అమెరికాలో గ్లోబల్ హెల్త్‌కేర్ లీడర్స్ ఫౌండేషన్ వార్షిక లీడర్‌షిప్ గాలా 2025 నిర్వహించింది. ఇందులో భాగంగా డాక్టర్ సతీష్ కత్తుల సేవలను గుర్తించిన గ్లోబల్ హెల్త్‌కేర్ లీడర్స్ ఫౌండేషన్ ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ ఇన్ గ్లోబల్ హెల్త్ లీడర్షిప్ 2025 అవార్డును ప్రదానం చేసి సత్కరించింది.
తన సేవలను గుర్తించి అవార్డును బహూకరించడం పట్ల డాక్టర్ సతీష్ కత్తుల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. డాక్టర్ సతీష్ కత్తుల తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు. 30 ఏళ్లుగా ఆయన అమెరికాలో వైద్య సేవలందిస్తున్నారు. డేటన్, ఒహియోలో నివసిస్తున్న డాక్టర్ సతీష్ కత్తుల ప్రఖ్యాత హెమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్.

2024- 2025 సంవత్సరానికి గాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్- AAPI కి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. జూలై 2024లో AAPI అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన భారత్‌లో మూడు ప్రధాన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సమావేశాలకు నాయకత్వం వహించారు. AAPI నిర్వహించిన అనేక అంతర్జాతీయ ఆరోగ్య శిఖరాగ్ర సమావేశాలలో ఆంకాలజీ ట్రాక్స్‌కు అధ్యక్షత వహించారు.
డాక్టర్ సతీష్ కత్తుల ఇటీవల జీవనశైలి మార్పులు, టీకాల ద్వారా క్యాన్సర్ నివారణపై దృష్టి సారించిన “స్టాప్ 3 అండ్ స్టార్ట్ 3” అనే పరివర్తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన నాయకత్వంలో, AAPI విద్య, స్క్రీనింగ్ మరియు రోగనిరోధకతలో సమగ్ర ప్రయత్నాల ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి గ్లోబల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ -GAIMS తో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.