
ఎకరాకు 30 టన్నుల దిగుబడి
టన్ను కాయలకు రూ.5 వేల రాబడి
సాగుకు రైతుల మొగ్గు
దేవరపల్లి: పొగాకు, జీడిమామిడి పంటలకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో ప్రత్యామ్నాయంగా పండ్ల తోటల సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి సాగుతో లాభాలు సాధిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని 326 హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కడియం, అనపర్తి, దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు మండలాల్లో దీని సాగు అధికంగా ఉంది. తెగుళ్లను తట్టుకునే రకాల మొక్కలను మహారాష్ట్ర నుంచి తీసుకుని వచ్చి, తోటలు వేసి అధిక దిగుబడులు సాధిస్తున్నారు.
బొప్పాయిలో అనేక రకాల వంగడాలున్నప్పటికీ ఎక్కువ మంది పింక్, కో–786, తైవాన్ రెడ్ లీడ్, స్వీట్ బరీ రకాలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. మొక్క వేసిన 9 నెలల్లో కాపు వస్తోంది. రెండు నుంచి నాలుగేళ్ల పాటు ఎకరాకు 30 నుంచి 40 టన్నుల చొప్పున దిగుబడి వస్తోంది.
దిగుబడి బాగుంటే నాలుగేళ్ల వరకూ తోటలు ఉంటాయి. కొంత మంది రెండేళ్లకే తోటలను తొలగిస్తున్నారు. మొదటి రెండేళ్లు దిగుబడి, పండు నాణ్యత, సైజు బాగుంటాయి. ఒక్కో పండు 2 నుంచి 4 కిలోల బరువు ఉంటుంది. ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోందని, పెట్టుబడి రూ.60 వేల నుంచి రూ.70 వేలు అవుతోందని చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు
» బొప్పాయి పండుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.
» ఇది జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.
» చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
» బరువు తగ్గడానికి, గుండె సంబంధిత సమస్యల నివారణకు తోడ్పడుతుంది.
» బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్–సి దంతాల చిగుళ్ల ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది.
» విటమిన్–బి నోటిపూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
» కెరోటిన్, ఎ, బి, సి, ఇ విటమిన్లు, ఖనిజాలు, ప్లేవొనాయిడ్‌లు, ఫోలేట్‌లు, పాంథోనిక్ ఆమ్లాల వంటి పోషకాలు బొప్పాయి పండులో పుష్కలంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
» ఇన్ని విధాల ఆరోగ్యం కలిగించేది కావడంతో బొప్పాయి పండును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు.
దిగుబడి బాగుంది
నేను నాలుగెకరాల్లో బొప్పాయి పంట వేశాను. రెండు కోతలు జరిగాయి. ఎకరాకు 20 టన్నుల దిగుబడి వచ్చింది. టన్ను కాయలకు రూ.10 వేలు లభించాయి. ప్రస్తుతం టన్ను కాయలు రూ.5 వేలు పలుకుతున్నాయి. రావులపాలెం, అమలాపురం ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కాయలు కొనుగోలు చేసి, కోల్‌కతా, భువనేశ్వర్ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
ధర బాగుంటే మంచి ఆదాయం వస్తుంది. జూలైలో తోట వేయగా, ఫిబ్రవరిలో కాపునకు వచ్చింది. మహారాష్ట్ర నుంచి మొక్క రూ.23 చొప్పున కొనుగోలు చేసి తెచ్చాను. ఎకరాకు 700 మొక్కలు పడతాయి. కాయ సైజు, నాణ్యత బాగున్నాయి. – కూచిపూడి రాజు, రైతు, పట్లంట్ల, దేవరపల్లి మండలం
కొవ్వూరు డివిజన్‌లో అధికం
బొప్పాయి సాగు కొవ్వూరు డివిజన్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. రాజమహేంద్రవరం డివిజన్‌లోని కడియం, అనపర్తి ప్రాంతాల్లో అక్కడక్కడ తోటలు వేశారు. వాతావరణం అనుకూలించి, తెగుళ్లు లేకుండా ఉంటే రైతులకు ఇది లాభదాయకమైన పంట. రైతులు ఇప్పుడిప్పుడే బొప్పాయి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.
– బి.సుజాత కుమారి, జిల్లా ఉద్యాన అధికారి, రాజమహేంద్రవరం
కోల్‌కతా, ఒడిశాకు ఎగుమతి
వేసవి అనంతరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో రైతులు బొప్పాయి తోటలు వేస్తారు. నల్ల నేలలు, ఇసుక, రాతి నేలలు దీని సాగుకు అనుకూలంగా ఉంటాయి. రాతి నేలలు, కొండ ప్రాంతాల్లో ఈ పంట పండదు. ఏటా మార్చి నుంచి జూన్ వరకూ దిగుబడి వస్తుంది. ఈ ప్రాంతంలో పండించిన బొప్పాయి కాయలు, పండ్లను ఒడిశా, భువనేశ్వర్, కోల్‌కతా వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.
ఒడిశాలోని పలు ప్రాంతాల్లో బొప్పాయి కాయలు కూరగా వండుకొని తింటూంటారు. దీంతో, ఆ ప్రాంతాలకు పచ్చి కాయలు కూడా ఎగుమతి చేస్తున్నారు. వేసవిలో పండ్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. స్థానికంగా ఉన్న పండ్ల వ్యాపారులు తోటల్లోకి వచ్చి పండు కాయలు కొనుగోలు చేస్తారు. వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కిలో రూ.10 పలికింది. ప్రస్తుతం రూ.5 పలుకుతోంది.