అదే జరిగితే ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది
హైకోర్టులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుబంధ పిటిషన్లు
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో అప్రూవర్లుగా మారుతామని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ప్రధాన నిందితులైన అప్పటి ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ స్పెషలాఫీసర్ దొడ్డా వెంకట సత్యప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలను వ్యతిరేకిస్తూ మరో నిందితుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోసం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్‌లలో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు కూడా వినాలని హైకోర్టును కోరారు. వీరివురి ముందస్తు బెయిల్ పిటిషన్లు ఈ నెల 28వ తేదీన (శుక్రవారం) హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో చెవిరెడ్డి తాజా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిలోని ముఖ్యాంశాలు ఇవీ..
బెయిల్‌తో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం
‘మద్యం అక్రమ కేసులో 2, 3 నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ అప్రూవర్లుగా మారి ముందస్తు బెయిల్ పొందితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. సాక్షులను బెదిరించే అవకాశం ఉంది. వారికి ముందస్తు బెయిలిస్తే అది కేసుతో పాటు ట్రయల్‌పై, సహనిందితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వీరిద్దరూ ఇచి్చన వాంగ్మూలాలు నమ్మదగినవి కావు. అందువల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కేసులో ట్రయల్ మొత్తం పూర్తయ్యేంత వరకు వారిద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలి. వారికి ముందస్తు బెయిల్ నిష్పాక్షిక దర్యాప్తు సూత్రాలకు విరుద్ధం. దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు 150 మంది సాక్షులను విచారించారు. 50 మందిని ఈ కేసులో చట్ట విరుద్ధంగా నిందితులుగా చేర్చారు.
తప్పు చేయకపోయినా కొందరు నిందితులు ఇప్పటికీ జైల్లోనే మగ్గుతున్నారు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం ఈ కేసులో పబ్లిక్ సర్వెంట్‌లుగా వీరిద్దరి పాత్ర కీలకం. అయితే ఇప్పటికీ వారిని అరెస్ట్ చేయలేదు. వారిపై ఎలాంటి శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. దర్యాప్తు సంస్థ రాజ్యాంగంలోని అధికరణ 14, 20, 21 నిర్దేశించిన నిష్పాక్షిక దర్యాప్తు సూత్రాలను ఉల్లంఘించినట్లు దీని ప్రకారం అర్థం అవుతోంది.
ఈ అక్రమ కేసులో కొందరిపై రాజకీయ కక్ష సాధింపు3లకు వీరిరువురి వాంగ్మూలాలను వినియోగించుకోవాలని బాబు సర్కార్ కనుసన్నల్లోని దర్యాప్తు సంస్థ కుట్ర పన్నుతోంది. ప్రధాన నిందితులుగా ఉన్న వారిని రక్షిస్తోంది. న్యాయపరమైన పర్యవసానాల నుంచి కాపాడుతోంది. ఇదే విషయంలో వీరు దాఖలు చేసిన పిటిషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. దీంతో వారిద్దరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు’ అని భాస్కర్‌రెడ్డి ఆపిటిషన్లలో వివరించారు.


