గవర్నర్‌ను కలసిన అనంతరం మీడియాతో బొత్స
కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం
కోటి సంతకాల కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, మేధావుల మద్దతు
కూటమి నేతలు కూడా ఇందులో పాల్గొన్నారు
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులకు ఉచితంగా వైద్య విద్య, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ సేకరించిన కోటి సంతకాల ప్రతులను అందజేసేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ అపాయింట్‌మెంట్ కోరుతూ గురువారం విజయవాడలో ఆయన్ని కలిశారు. అనంతరం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావులతో కలసి బొత్స మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న చంద్రబాబు నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు, విద్యార్థులతో పాటు ప్రజాసంఘాలు, మేధావులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాలను క్రోడీకరించి గవర్నర్‌కి సమర్పించనున్నట్లు బొత్స పేర్కొన్నారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నట్లు చెప్పారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు.
ప్రజారోగ్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలే గానీ ప్రైవేటు ఆధీనంలో ఉంటే ప్రజలకు న్యాయం జరగదు. ప్రజారోగ్యం కోసం పరితపించిన వ్యక్తిగా వైఎస్ జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఐదు కాలేజీలు పూర్తై తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్‌కు పేరు వస్తుందన్న అక్కసుతోనే మిగిలిన వాటిని సీఎం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారు. స్కూలు పిల్లలకు ఉచితంగా ట్యాబులిస్తే గేమ్స్ ఆడుకుంటారని మాక్ అసెంబ్లీలో విద్యార్థులతో చెప్పించడం సిగ్గుచేటు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ఎలాంటి ప్రభావాన్ని చూపించిందో.. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశాం. ఈ క్రమంలో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒక్కో కాలేజీకి రూ.500 కోట్లు కేటాయించి, ప్రభుత్వ నిధులతో పాటు వివిధ ఆర్థిక సంస్థలతో టై అప్ చేసి పనులు ప్రారంభించాం. మెడికల్ కాలేజీలకి అనుసంధానంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా నిర్మించే ఏర్పాట్లు చేశాం.
దురదృష్టవశాత్తూ ప్రభుత్వం మారిన తర్వాత మెడికల్ కాలేజీలని్నంటినీ పీపీపీ పేరుతో ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తారు. ఇప్పటికే ప్రైవేటు ఆసుపత్రుల్లో 30 శాతం పేదలకు చికిత్స చేయాలన్న నిబంధన ఉన్నా ఎక్కడా అమలు కాని పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్ పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా వైద్య చికిత్స పొందాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద 2 వేల వరకు అదనపు ప్రొసీజర్లను చేర్చడంతో పాటు ఉచిత చికిత్స పరిధిని రూ.25 లక్షల వరకు విస్తరించారు. ఈ ప్రభుత్వానికి పేదలపై ఇంత కక్ష ఎందుకు? నెలకు రూ.300 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు చేయలేదా?
బిల్లులు విడుదల కాకపోవడంతో నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్లకు చికిత్స అందని పరిస్థితి నెలకొంది. పథకాన్ని నీరుగార్చి బీమా పరిధిలోకి తెస్తామంటున్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో 60 లక్షల మందికి ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించాం. రూ.14 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించాం. ఇంత డబ్బు ప్రైవేటు సంస్థలు అందిస్తాయా? ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ప్రజారోగ్యం నాశనం అయిపోయినా ఫర్వాలేదు అనుకుంటున్నారా? ఇది దోపిడీ కాదా?
రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేశారు. ఏ పంటకూ మద్దతు ధర లేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రాయలసీమలో అరటి పంట తీవ్ర సంక్షోభంలో పడింది. 18 నెలలుగా శాంతి భద్రతలు దిగజారాయి. సంక్షేమ హాస్టళ్లలో కలుషిత ఆహారం తిని పిల్లలు అనారోగ్యం పాలై చనిపోతున్నారు.
రాజ్యాంగ ఆమోద దినోత్సవం పేరు ఉచ్ఛరించడానికి కూడా కూటమి ప్రభుత్వానికి అర్హత లేదు. రాజ్యాంగం అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న ముగ్గురేనా? ప్రతిపక్ష నేతలను, వారి ఉనికిని కూడా భరించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబూ?
పవన్ కళ్యాణ్ గతంలో ఆయన చేసిన ప్రసంగాలను ఒక్కసారి మళ్లీ వింటే బాగుంటుంది. ఆయన బూతులు మాట్లాడితే ఒప్పా? కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. ఆ తర్వాత కూడా అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు? ఒక డీఎస్పీ అవినీతిపరుడని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు?


