సర్టిఫైడ్ కాపీలు కావాలని కోరిన న్యాయవాది పొన్నవోలు
పీపీ అభ్యంతరంతో కోర్టులో తీవ్ర వాదోపవాదాలు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల కొట్టివేతపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య కోర్టులో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు కేసులో సాక్షులు ప్రభుత్వోద్యోగులు కావడంతో వారిని భయపెట్టి కేసులు కొట్టివేయించుకుంటున్నారని, అలా కొట్టేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు.
దీంతో.. ఈ కేసులతో సంబంధంలేని వ్యక్తులు సర్టిఫైడ్ కాపీలు ఎలా అడుగుతారని పీపీ అభ్యంతరం తెలిపారు. ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసు అని, సర్టిఫైడ్ కాపీలు థర్డ్ పార్టీ ఎవరైనా కోరవచ్చని పొన్నవోలు చెప్పారు. ఇందుకు సంబం«ధించి గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. సాక్షులను ప్రభావితం చేసి, వారిని భయపెట్టి చంద్రబాబు కేసులు కొట్టివేయించుకుంటున్నారంటూ కోర్టులో ఆయన బలంగా వాదనలు వినిపించారు.
ముఖ్యంగా అసైన్డ్ భూముల వ్యవహారంలో చంద్రబాబుపై నమోదైన కేసుకు సంబంధించి గురువారం పీపీకి, పొన్నవోలుకు మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. అసైన్డ్ భూముల కేసు కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో తాము థర్డ్ పార్టీకి ఇచ్చేదిలేదని లిఖితపూర్వకంగా చెప్పాలని పొన్నవోలు కోరారు.


