అంగీకరించిన మంత్రి అనధికారిక పీఏ సతీష్
అతడి ‘కీచక’ పర్వంపై ఎస్పీకి ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉద్యోగం ఇప్పిస్తానని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఒంటరి మహిళను ఆర్థికంగా దోచుకుని, తర్వాత లైంగికంగానూ వేధించిన మంత్రి అనధికారిక పీఏ సతీష్ నిజం ఒప్పుకొన్నాడు. అతడి ఆగడాలను.. ‘‘మంత్రి కొడుక్కి నీపై మనసైంది’’ శీర్షికన గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో తన దుర్మార్గాన్ని సమర్థించుకునే క్రమంలో సతీష్ వాస్తవాన్ని చెప్పేశాడు. బాధిత మహిళ నుంచి తాను డబ్బు తీసుకున్నది నిజమేనని అంగీకరించాడు. అది అప్పుగా మాత్రమేనని బుకాయించాడు.
అయితే, భర్త చనిపోయి.. తీవ్ర అనారోగ్యం పీడితురాలైన బిడ్డతో.. కారుణ్య ఉద్యోగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళ నుంచి సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అనుచరుడు అప్పు తీసుకున్నానని చెప్పడంతోనే అతడి వాదన డొల్ల అని స్పష్టమైంది. మరోవైపు బాధిత మహిళతో పాటు ఆమె పక్షాన నిలిచిన ‘సాక్షి’పై కేసులు పెడతామని సతీష్ బెదిరింపులకు దిగాడు. అధికారం అండతో అనధికారిక పీఏగా ఉంటూ.. మహిళను వేధించింది కాక మరింత బరితెగించాడు.
డబ్బు దండుకున్నది కాక మానప్రాణాలతో చెలగాటం
‘‘ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, అండగా నిలవాల్సిన మహిళా మంత్రే నిందితుడిని వెనకేసుకొస్తున్నారు. ఉద్యోగం పేరుతో డబ్బు దండుకున్నది కాక మానప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని బాధిత మహిళ వాపోయింది. మంత్రి అనధికారిక పీఏ సతీష్ ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని ఐద్వా, శ్రామిక మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.


