కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు పొందడానికి సహకారం
కాంట్రాక్టు విలువ రూ.7.68 కోట్లు
ఈపీసీ పద్ధతిలో ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలని షరతు
సాక్షి, అమరావతి: పోలవరం–బనకచర్ల అనుసంధానం(లింక్) ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతానికి పోలవరం–నల్లమలసాగర్ వరకే పరిమితం చేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) మార్గదర్శకాల ప్రకారం పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు చేపట్టడానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీతోపాటు కేంద్రప్రభుత్వ సంస్థల నుంచి అన్ని రకాల అనుమతులు తెచ్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని అందించే పనులకు జలవనరులశాఖ గురువారం టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.
కాంట్రాక్టు విలువను రూ.7,68,33,372గా నిర్ణయించింది. ఈపీసీ (ఇంజినీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) పద్ధతిలో ఏడాదిలోగా ఈ పనులు పూర్తిచేయాలని నిర్దేశించింది. ఈ టెండర్‌లో బిడ్‌ల దాఖలుకు డిసెంబర్ 11వ తేదీని తుదిగడువుగా తెలిపింది. డిసెంబర్ 17న ఆర్థిక బిడ్ తెరిచి.. తక్కువ ధరకు కోట్‌చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించనుంది. డీపీఆర్ తయారీలో భాగంగా లైడార్ సర్వే చేయాలని నిర్దేశించింది.
ఈ లింక్ ప్రాజెక్టును మూడుభాగాలుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో పోలవరం నుంచి కృష్ణానదిలోకి, రెండోదశలో కృష్ణా నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, మూడోదశలో బొల్లాపల్లి నుంచి నల్లమలసాగర్‌కు గోదావరి జలాలు తరలించేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. లైడార్ సర్వేలో ఈ మూడు భాగాల్లో అలైన్‌మెంట్‌ను ఖరారు చేసి గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు ఏర్పాటుచేయాలని.. పనులు చేపట్టడానికి అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని టెండర్లలో షరతు విధించింది.
గతనెలలో పిలిచిన టెండర్లు రద్దు
సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ, అవసరమైన పరిశోధనలు, కేంద్రం నుంచి చట్టపరమైన అనుమతులు పొందడానికి సహకారం అందించే పనులకు అక్టోబర్ 7న జారీచేసిన నోటిఫికేషన్‌కు సంబంధించిన టెండర్లను జలవనరులశాఖ రద్దుచేసింది. రూ.9.20 కోట్ల విలువైన ఈ పనులకు బిడ్‌ల దాఖలు గడువు గత నెల 22తో ముగిసింది. కానీ.. ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోవడంతో ఆ టెండర్లను రద్దుచేసింది. ఇప్పుడు ఆ లింక్ ప్రాజెక్టును పోలవరం–నల్లమలసాగర్‌కే పరిమితం చేసి డీపీఆర్ తయారీకి టెండర్లు పిలిచింది.
ఇకపోతే.. పోలవరం నుంచి బనకచర్లకు 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించే ప్రాజెక్టుకు అనుమతి కోసం సీడబ్ల్యూసీకి మే 22న పీఎఫ్‌ఆర్ (ప్రీ ఫీజుబులిటీ రిపోర్టు)ను రాష్ట్ర జలవనరులశాఖ సమరి్పంచింది.. దీనిపై సీడబ్ల్యూసీ బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలు.. గోదావరి, కృష్ణా బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అభిప్రాయాలను కోరింది.
ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కోసం దరఖాస్తు చేయడానికి పర్యావరణ ప్రభావ అంచనా (ఈఏఐ)పై అధ్యయనం చేయడానికి నియమ, నిబంధనల (టీవోఆర్) రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర అటవీ, పర్యావరణశాఖ ఈఏసీ (ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ) జూన్ 30న తోసిపుచి్చంది. గోదావరి నదిలో వరద జలాల లభ్యత.. అంతర్‌రాష్ట్ర అనుమతి తీసుకున్న తర్వాతే టీవోఆర్ కోసం దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు పనుల నిమిత్తం పర్యావరణ, వైల్డ్‌లైఫ్ (వన్యప్రాణులు), అటవీ అనుమతుల కోసం అవసరమైన నివేదికల తయారీ పనులను జనవరి 26న రూ.1.77 కోట్లకు ఎస్వీ ఎన్విరో ల్యాబ్స్ అండ్ కన్సల్టెంట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది.
పోలవరం–బనకచర్ల డీపీఆర్ టెండర్‌పై వాస్తవ పరిస్థితి చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి బోర్డు మరోసారి లేఖ
సాక్షి, అమరావతి : పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి జారీచేసిన టెండర్ నోటిఫికేషన్‌పై వాస్తవ పరిస్థితి ఏమిటో వారంలోగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి రంగస్వామి అజగేశన్ గురువారం మరోసారి లేఖ రాశారు. ఇదే అంశంపై గతనెల 16న లేఖ రాశామని.. కానీ, స్పందనలేదని అందులో గుర్తుచేశారు. తక్షణమే ఆ టెండర్ వాస్తవ పరిస్థితిని తెలపాలని ఆయన కోరారు.


