అస్మదీయుడనేదే ఏకైక అర్హత
అనుభవం లేకపోయినా సరే మరో సంస్థతో జత చేసి దోపిడీకి ప్లాన్
వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ టెండర్లలో గోల్‌మాల్
రూ.370.42 కోట్ల కాంట్రాక్టు విలువతో అక్టోబర్ 1న పనులకు టెండర్ నోటిఫికేషన్
4.59 శాతం అధిక ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కేఎమ్వీ–జీడీఆర్(జేవీ) సంస్థ రూ.387.42 కోట్ల పనులు అప్పగించిన చంద్రబాబు సర్కారు
కేఎమ్వీ ప్రాజెక్ట్స్‌కు ప్రధాన కాంట్రాక్టర్‌గా అనుభవం లేదంటోన్న ఇంజినీరింగ్ నిపుణులు
అందుకే జేడీఆర్ కన్‌స్ట్రక్షన్స్‌తో జతకట్టించి పనులు అధిక ధరకు కట్టబెట్టారంటోన్న కాంట్రాక్టు వర్గాలు
ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ.17 కోట్లకుపైగా భారం
అధిక ధరలకు అస్మదీయునికి పనులు కట్టబెట్టేలా చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు
భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయంటూ ఆరోపణలు
సాక్షి, అమరావతి: అనుభవం, అర్హతా లేని అస్మదీయ కంపెనీకి భారీ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు సర్కారు పెద్దలు నిబంధనలు తుంగలోతొక్కారు. మరో కంపెనీని జత చేసి మరీ జాయింట్‌గా దండుకునేలా చక్రం తిప్పారు. వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ టెండర్లలో జరిగిన ఈ గోల్‌మాల్ ఇంజినీరింగ్ నిపుణులను సైతం విస్తుపోయేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో భారీఎత్తున ముడుపులు చేతులు మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అత్యంత సన్నిహిత సంస్థ కాబట్టే..!
జలవనరుల శాఖ టెండర్ నిబంధనల ప్రకారం వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటైనింగ్ వాల్ టెండర్లలో పనులు అప్పగించాలంటే సదరు కాంట్రాక్టు సంస్థ 2015–16 నుంచి 2024–25 వరకూ ఏదైనా ఒక ఏడాదిలో రూ.148.16 కోట్ల విలువైన కాలువ లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులను ప్రధాన కాంట్రాక్టర్‌గా పూర్తి చేసి ఉండాలి. కానీ.. కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థకు ప్రధాన కాంట్రాక్టర్‌గా ఆ మేరకు అనుభవం లేదు. ఆ సంస్థ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిది.
అదే సంస్థకు పనులు కట్టబెట్టాలని టెండర్ నోటిఫికేషన్ ముందే నిర్ణయం జరిగిపోయినట్టు కాంట్రాక్టు వర్గాలు చెబుతున్నాయి. దీంతో జీడీఆర్ కన్‌స్ట్రక్షన్స్ అనే సంస్థతో కేఎమ్వీ ప్రాజెక్ట్స్ సంస్థను జత కట్టించి.. జాయింట్ వెంచర్(జేవీ)గా ఏర్పాటుచేసి కాంట్రాక్టు విలువ రూ.370.42 కోట్ల కంటే 4.59 శాతం అధిక ధర అంటే రూ.387.42 కోట్లకు కోట్ చేయించి బిడ్ దాఖలు చేయించారు.
అదే సంస్థ ఎల్–1గా నిలవడంతో పనులను కట్టబెట్టారు. దీని వల్ల ఖజానాపై అదనంగా రూ.17 కోట్లకుపైగా భారం పడింది. అంచనాల దశలోనే పనుల వ్యయాన్ని పెంచేసి.. అధిక ధరలకు అస్మదీయునికి కట్టబెట్టేలా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని ఇంజినీరింగ్ నిపుణులు ఆరోపిస్తున్నారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 11,584 క్యూసెక్కులు తరలించి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసి.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 4,47,300 ఎకరాలకు నీళ్లందించడంతోపాటు 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని తీర్చాలనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్ 27న వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
జలయజ్ఞంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూ.3,581.57 కోట్లు ఖర్చు చేసి.. అధిక శాతం పనులు పూర్తి చేశారు. అనంతరం కీలకమైన సొరంగాల పనులను రూ.1,046.46 కోట్లు ఖర్చు చేసి గత సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు.
కిలోమీటర్ లైనింగ్‌కు రూ.17కోట్లు!
శ్రీశైలం జలాశయం నుంచి సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలు తరలించడానికి 23 కిలోమీటర్ల పొడవున 11,585 క్యూసెక్కులు తరలించేలా ఫీడర్ చానల్‌నూ ఇప్పటికే తవ్వారు. 2014 నుంచి కురిసిన భారీ వర్షాల వల్ల ఫీడర్ కెనాల్ గట్లు 0 కిలోమీటర్ల నుంచి 21.8 కిలోమీటర్ల వరకు కొన్ని చోట్ల దెబ్బతిన్నాయి. ఫీడర్ కెనాల్ గట్లు బలహీనంగా ఉన్న చోట కాంక్రీట్ రిటైనింగ్ వాల్, మిగతా ప్రాంతాల్లో కాంక్రీట్ లైనింగ్ చేసే పనులకు రూ.370.42 కోట్లను కాంట్రాక్టు అంచనా విలువగా నిర్ణయించి, అక్టోబర్ 1న జలవనరుల శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పనులను 15 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించింది. ఈ పనులకు అంచనాల దశలోనే భారీ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కిలోమీటర్ లైనింగ్‌కు రూ.17 కోట్లను అంచనాగా నిర్ణయించడం గమనార్హం. అస్మదీయునికి పనులు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచేసే ఎత్తుగడలో భాగంగానే అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసేలా చక్రం తిప్పారని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ముందే అనుకున్నట్లుగా అంచనా వ్యయాన్ని పెంచి.. అధిక ధరలకు అస్మదీయునికే ఆ పనులు కట్టబెట్టారు.


