శ్రీసత్యసాయి జిల్లాలో గొంతునులిమి నాలుగేళ్ల బాలుడి దారుణహత్య
అసూయతో బావమరిది కుమారుడిని అంతమొందించిన వైనం
తలుపుల/ఎన్‌పీకుంట/కదిరి టౌన్: బావమరిది డబ్బు ఇవ్వలేదనే కక్ష, తన కుమారుడి కంటే అతడి కుమారుడు ఆరోగ్యంగా ఉన్నాడని అసూయతో రగిలిపోతూ... నాలుగేళ్ల చిన్నారిని అంతమొందించాడు ఓ దుర్మార్గుడు. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం గెరికపల్లిలో జరిగిన ఈ ఘటన వివరాలు పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు... గెరికపల్లికి చెందిన గంగరాజు తన కుమార్తె నీలావతిని కదిరి మండలం మూర్తిపల్లి వాసి ప్రసాద్‌కు ఇచ్చి కొన్నేళ్ల క్రితం వివాహం చేశారు.
వీరికి కుమారుడు రూపేశ్, కుమార్తె ఉన్నారు. రూపేశ్ బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. గంగరాజు హైదరాబాద్‌లో కూలీ చేస్తూనే మనవడిని తీసుకెళ్లి వైద్యం చేయించాడు. అయితే, తాపీ పనులు చేసే ప్రసాద్ వ్యసనాలకు బానిసయ్యాడు. కుమారుడు రూపేశ్ చికిత్సకు బావమరిది గంగాధర్ నుంచి రూ.3 లక్షలు తీసుకున్నాడు. ఇంకా కావాలని కోరగా లేవని చెప్పాడు. దీంతో ప్రసాద్ కోపం పెంచుకున్నాడు.
తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతుండగా, గంగాధర్ కుమారుడు హర్షవర్ధన్ (4) చురుగ్గా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ‘నాలాగే మీరు కూడా క్షోభ అనుభవించాలన్న’ పగతో హర్షవర్ధన్‌ను చంపాలని నిర్ణయించుకున్నాడు. 2 నెలలుగా తరచూ గెరికపల్లి వెళ్తూ చిన్నారిని ముద్దుచేస్తున్నాడు. బుధవారం అంగన్‌వాడీ సెంటర్ నుంచి హర్షవర్ధన్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడినుంచి తోటకు, తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
హర్షవర్ధన్ తల్లిదండ్రులు పొలానికి వెళ్తూ త్వరగా వచ్చేస్తామనే ఆలోచనతో బాలుడిని ఇంటి వద్దే ఉంచారు. ఇదే అదనుగా హర్షవర్ధన్‌ను ప్రసాద్ బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. కొద్దిదూరం వెళ్లాక సంచిలో వేసుకున్నాడు. మాటలు రాని ఓ వ్యక్తి దీన్నంతటినీ గమనించి గ్రామస్తులకు తెలిపేందుకు ప్రయత్నించినా వారు అర్థం చేసుకోకపోయారు. ఈ లోగా ప్రసాద్ మార్గమధ్యంలోనే బాలుడిని గొంతునులిమి చంపేశాడు. మృతదేహాన్ని 15 కిలోమీటర్లపైగా దూరంలోని నంబులపూలకుంట మండలం మరికొమ్మదిన్ని గ్రామ సమీప పొలాల్లో పడేశాడు. ఏమీ ఎరుగనట్లు గెరికపల్లికి వచ్చాడు.
హర్షవర్ధన్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పలుచోట్ల వెదికారు. తలుపుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కదిరి రూరల్ సీఐ నాగేంద్ర, ఎస్‌ఐ నరసింహులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్ ప్రవర్తనపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. గురువారం తెల్లవారుజామున హర్షవర్ధన్ మృతదేహాన్ని గుర్తించారు. తర్వాతా కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ కదిరికి వచ్చి బాలుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు.


