భళా.. బాలకా
ప్రశాంతినిలయం: భారతీయ సనాతన సంస్కృతిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు భళా అనిపించాయి. ఆదివారం పుట్టపర్తిలోని సత్యసాయి హిల్‌వ్యూ స్టేడియంలో సత్యసాయి విద్యాసంస్థల సాంస్కృతిక క్రీడా సమ్మేళనం–2026 అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రశాంతి నిలయం నుంచి సత్యసాయి చిత్రపటాన్ని పండితుల వేద పఠనం, విద్యార్థుల బ్రాస్ బ్యాండ్ వాయిద్యం నడుమ హిల్‌వ్యూ స్టేడియంలోని శాంతివేదిక వద్దకు తీసుకొచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్‌తో వేడుకలను ప్రారంభించారు. విద్యా సంస్థల వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ క్రీడా ప్రతిజ్ఞ అనంతరం జ్యోతిని వెలిగించి సమ్మేళనాన్ని ప్రారంభించారు. అనంతపురం సత్యసాయి విద్యాసంస్థల క్యాంపస్, సత్యసాయి వైద్య సంస్థల అనుబంధ విభాగాల విద్యార్థులు, ప్రశాంతి నిలయం క్యాంపస్ విద్యార్థులు ప్రదర్శించిన సాహస విన్యాసాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.జిమ్నాస్టిక్స్,భంగీజంప్, సైక్లింగ్, బైక్ రైడింగ్, కత్తి సాము, కర్ర సాము, యోగా, పాశ్చాత్య నృత్య ప్రదర్శనలు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి. పతంగుల నృత్య ప్రదర్శన, రోప్ వే విన్యాసాలు, అర్ధ నారీశ్వర ప్రదర్శనతో భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఘనంగా చాటారు.
● సాయంత్రం వేడుకల్లో భాగంగా ఈశ్వరమ్మ ఉన్నత పాఠశాల విద్యార్థులు, సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, ప్రశాంతి నిలయం, బృందావన్, నందగిరి క్యాంపస్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు, గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి, ట్రస్ట్ సభ్యులు నాగానంద, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన సత్యసాయి సాంస్కృతిక క్రీడా సంబరం
సాహస కృత్యాలతో ప్రేక్షకులను అబ్బుర పరచిన విద్యార్థులు
భళా.. బాలకా
భళా.. బాలకా
భళా.. బాలకా


