అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
హిందూపురం/చిలమత్తూరు: అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో ఆదివారం తెల్లవారుజామున లేపాక్షి మండలం తిలక్‌నగర్‌లో 120 మంది పోలీసు సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు, రికార్డులు లేని 60 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలను సీజ్ చేశారు. అనంతరం గ్రామసభ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ రౌడీ షీటర్లు, పాత నేరస్తులలో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరి నడవడికపై డేగకన్నుతో పరిశీలిస్తుంటామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దు కావడం, రైల్వేట్రాక్, జాతీయ రహదారి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతం నేరస్తులకు అనుకూలంగా మారే అవకాశం ఉందని, అందుకే ఇక్కడ ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. నైట్‌విజన్ డ్రోన్, సీసీ కెమెరాల నిఘా మరింత పెంచుతామన్నారు. రాజకీయ, కులాల పేరుతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలని హితవు పలికారు. వాహనాలు కొనుగోలు చేసే ముందు పక్కాగా అన్ని రికార్డులు పరిశీలించుకోవాని సూచించారు. ఓ హత్య కేసులో నిందితులకు ఎస్పీ కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం చిలమత్తూరు పోలీసుస్టేషన్‌ను ఆయన పరిశీలించారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. కార్యక్రమంలో హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్, సీఐలు జనార్ధన్, రాజగోపాల్ నాయుడు, కరీం, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్ కుమార్


