
కామెంట్
నేను బీజింగ్ నుండి తిరిగి వచ్చి పదిహేను సంవత్సరాలు గడిచింది కానీ, నేను ఇంకా దాని గురించి రాయబోతున్నాను. అప్పట్లోనే చైనా రాజధాని నన్ను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పడం దాన్ని తక్కువ చేసినట్లే అవుతుంది. నిజం ఏమిటంటే బీజింగ్‌లో ఆనాడు నేను చూసిన, కనుగొన్న అంశాలు నన్ను ఆశ్చర్యచకితుడిని చేశాయి. ఇప్పుడు అదనంగా, చాలా కాలం క్రితం పరిష్కృతమైందని నేను భావించిన వాస్తవం, పాత చర్చను మళ్ళీ రేకెత్తించింది.
నేను బీజింగ్‌లో మూడు రోజులు మాత్రమే ఉన్నాను. రాజధానిలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూశానని చెప్పాలి. కానీ గ్రేట్ వాల్, మింగ్ సమాధులను దర్శించాను. నగరంలో, గంటల తరబడి డ్రైవింగ్ చేస్తూ గడిపాను. కానీ నేను చూసిన ప్రతిదీ అభివృద్ధి చెందిన మొదటి ప్రపంచాన్ని సూచించింది. రోడ్లు, భవనాలు, దుకాణాలు, ప్రజల వేషధారణ, వారి ప్రవర్తన... మూడవ ప్రపంచ నగరాన్ని కాదు, యూరోపియన్ లేదా ఉత్తర అమెరికా మహానగర సంçస్కృతిని తలపింపజేశాయి. ఏ అర్థంలో చూసినా ఈ అంశాలలో దేనిలోనూ ఢిల్లీ పోటీపడలేదు.
బీజింగ్ నమ్మశక్యం కాని విధంగా శుభ్రంగానూ, ఆశ్చర్యకరంగా స్నేహపూర్వకంగానూ ఉంది. చైనీయులు బహిరంగంగా ఉమ్మివేస్తుంటారని నాకు చెప్పారు. నేను చైనాలో గడిపిన మూడు రోజుల్లో అలా ఉమ్మి వేసినవారిని అరడజను మందిని కూడా చూడలేదు. మింగ్ సమాధులు లేదా ఫర్బిడెన్ సిటీ వద్ద వేలాది మంది ఉన్నారు కానీ వారిలోనూ ఈ అలవాటును చూడలేదు. కాలిబాటలపై చెత్త లేదు, గోడలపై పాన్ మరకలు లేవు, దుకాణాల వెలుపల పారవేసిన సిగరెట్ పీకలు, చిరిగిన పాలిథిన్ సంచులు కూడా లేవు.
అంతేకాకుండా చైనీయులు స్నేహపూర్వకంగా ఉన్నారు. నేను హోటల్ నుండి తియానన్మెన్ స్క్వేర్‌కు వెళుతున్నప్పుడు అపరి చితులు తరచుగా నడుచుకుంటూ వచ్చి కబుర్లు చెప్పారు. వారు అడుగులో అడుగు వేసి, అది సహజమైన, స్పష్టమైన పని అన్నట్లుగా సంభాషణను ప్రారంభించారు. వారిలో చాలామంది ఇంగ్లిష్ అభ్యసించే విద్యార్థులే అంటే సందేహం లేదు, కానీ మరే ఇతర నగరంలోనూ ఇంత స్వేచ్ఛాయుతమైన ప్రవర్తనను ఎప్పుడూ చూడలేదు.
ఏది మంచి వ్యవస్థ?
వాస్తవానికి 1962 నాటికి చైనాతో మనకు ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితిపై, చైనా–ఇండియా పోటీపై స్పష్టమైన భారతీయ దృక్పథంతో నేను బీజింగ్‌కు వెళ్లాను. కానీ, చైనా పట్ల తీవ్రతకు తగ్గని ఆకర్షణ, ఏకపక్షతతో తిరిగి వచ్చాను. కానీ ఇప్పుడు అది పాత భావజాల ఘర్షణను మళ్లీ రగిలించింది.
నిరంకుశ రాజ్యమైన చైనా – ఆర్థిక వృద్ధిని, అభివృద్ధిని తన ప్రాథమ్యంగా చెప్పుకొంటుంది. స్వేచ్ఛా వ్యక్తీకరణ, సహకారం, రాజకీయ ఎంపికలకు సంబంధించిన ఉదారవాద హక్కులను విస్మరిస్తుంది. క్రమశిక్షణ అనేది అక్కడ స్వేచ్ఛా వ్యక్తీకరణ కంటే ముఖ్యమైనది. భిన్నాభిప్రాయాన్ని తీవ్రంగా శిక్షిస్తారు. దీనికి విరుద్ధంగా, భారతదేశం స్వేచ్ఛా పత్రికా వ్యవస్థ, బహుళ, పోటీ రాజకీయ పార్టీలు, స్వతంత్ర న్యాయవ్యవస్థతో పాటు సిద్ధాంతపరంగా తాము కోరుకున్నది చేయడానికి స్వేచ్ఛ ఉన్న వ్యక్తులతో కూడిన ప్రజా స్వామ్యం. మనం తరచుగా మన ప్రభుత్వాలను మారుస్తాం. తరచుగా మన రాజకీయ నాయకులను పక్కన పెడుతుంటాం. స్పష్టంగా చెప్పాలంటే, భారత్‌తో పోలిస్తే చైనా తక్కువ ఆహ్వానించదగిన దేశంగా కనిపిస్తుంది.
కానీ ఈ విషయాన్ని కాస్త భిన్నంగా చూడండి: చైనా తన ప్రజలకు ఆర్థిక భద్రత, మెరుగైన జీవనశైలి, అధిక తలసరి ఆదాయం ఇచ్చింది. 1947లో (లేదా 1949లో, పీపుల్స్ రిపబ్లిక్ పుట్టినప్పుడు) భారత్, చైనాలు ఒకే ఆర్థిక స్థితిలో ఉన్నాయి. 2010లో, నేను చైనాను సందర్శించినప్పుడు, దాని తలసరి ఆదాయం నాలుగు రెట్లు ఎక్కువ. వారి పిల్లలలో 7 శాతం మందే పోషకాహార లోపంతో ఉన్నారు; కానీ మన పిల్లలలో 46 శాతం మంది పోషకాహార లోపంతో ఉన్నారు. దేశంలో పరిస్థితులు మారాయనడంలో సందే హం లేదు. కానీ భారతీయులు పేదరికం నుంచి పూర్తిగా బయట పడతారనే భావన సందేహంగానే ఉంటుంది!
కాబట్టి రెండు దేశాలకు సంబంధించి ఏది మంచి వ్యవస్థ? అత్యవసర పరిస్థితి సమయంలో గంటల తరబడి దీనిపై తీవ్రమైన చర్చను నిర్వహించిన విషయం నాకు గుర్తుంది. 1977 ఎన్నికలు ఈ విషయాన్ని పరిష్కరించాయని నేను అనుకున్నాను. భారత ప్రజలు స్వేచ్ఛ కోసం ఓటు వేసి, ఇందిరా గాంధీ వేసిన పురోగతి, అభివృద్ధి అనే ఎరను తిరస్కరించారు. కానీ చైనా ఆ ప్రశ్నను తిరిగి మేల్కొలిపింది. ముప్పై సంవత్సరాలుగా చైనా సాధిస్తూ వచ్చిన 10 శాతం వృద్ధి, భారత్ సాధించిన దానికి స్పష్టమైన, ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తోంది. పైగా రానురానూ ఈ అంతరం పెరు గుతూ ఉండవచ్చు.
నేను నా భావనలను స్థిరం చేసుకునే ముందు చైనా గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి, చూడాలి. కానీ నా విశ్వాసం దెబ్బతింది. తద్వారా వచ్చిన ప్రశ్నలు నన్ను కలవరపెడుతున్నాయి.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్