చైనాతో దోస్తీకి దేశాల ఉబలాటం | The Quad has issued a joint statement | Sakshi
Sakshi News home page

చైనాతో దోస్తీకి దేశాల ఉబలాటం

Jul 5 2025 3:20 AM | Updated on Jul 5 2025 3:20 AM

The Quad has issued a joint statement

అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల కూటమిని ‘క్వాడ్‌’గా పిలుస్తున్నారు. ఈ కూటమి జూలై 1న వాషింగ్టన్‌ డి.సి.లో సమావేశమై ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. దీన్ని పరిశీలించినవారికి ‘క్వాడ్‌’ దాని సుదీర్ఘ పయనంలో మొదటిసారిగా అస్పష్టతకు స్వస్తి పలికి, తన ప్రధాన కర్తవ్యాన్ని వెల్లడించినట్లుగా కనిపించింది. సముద్ర జలాలలో చైనా చర్యలను అది ఈసారి గతంలోకన్నా ఎక్కువగా వేలెత్తి చూపుతూ విమర్శలను గుప్పించింది. 

ఇతర దేశాలను ఆర్థికంగా లొంగదీసుకునేందుకు అనుసరిస్తున్న ఎత్తుగడలు, ధరలలో కపటత్వం, సరఫరాలకు అవాంతరాలు కల్పించడం, కీలక ఖనిజాల ఉత్పత్తిపై దృష్టి కేంద్రీకరించేందుకు మార్కెటేతర సూత్రాలను ఉపయోగించుకోవడం వంటివాటిని ప్రస్తావిస్తూ చైనాను కడిగేసింది. అదే సమయంలో, ప్రకటనకు ఉపయోగించిన భాషలో దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శించింది. 

తేటతెల్లమైన చైనా తీరు
‘క్వాడ్‌’ సమావేశమైన ప్రతిసారీ బీజింగ్‌పై కత్తులు నూరుతూనే ఉంది. కానీ, ఈ వారంలో జరిగిన సమావేశం తమ లక్ష్య సాధనపై సంకోచాలకు తావు ఇవ్వలేదు. అవి సముద్ర జలాల్లో భద్రత, ఆర్థిక భద్రత, కీలక, ప్రవర్ధమాన టెక్నాలజీలు, మానవతా సహాయంలో సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. కానీ దృష్టి అంతా చైనాపైనే ఉండటంతో ఎజెండాలోని అంశాలు మరుగున పడ్డాయి. కానీ, దౌత్యపరంగా చైనాను తీవ్రంగా మందలించడం అరుదైన విషయం కనుక ‘క్వాడ్‌’ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ళ విరామం తర్వాత, చైనా భౌగోళిక రాజకీయ యవనికపై తిరిగి తన పాత్రను చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉండటం వల్ల అదే పెద్ద అంశంగా మారింది.

కోవిడ్‌–19 మహమ్మారి 2020 ప్రారంభంలో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయడం ప్రారంభించింది. సమాచారాన్ని బయటకు పొక్కనీయని వ్యవస్థల వల్ల ఏర్పడే ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విధ్వంసకర పర్యవసానాలకు దారితీయగలవో ఆ సందర్భంగా ప్రపంచానికి తెలిసి వచ్చింది. తూర్పు లద్దాఖ్‌ లోకి చైనా దళాలు చొచ్చుకు రావడంతో భారత్‌ అప్రమత్తమైంది. భారతీయ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించేందుకు సుముఖంగా ఉన్న, మొండిగా మారిన పొరుగుదేశం నుంచి ఎదురుకాగల ప్రమాదాలను ఇండియా గ్రహించింది. 

తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రాలలో, తైవాన్‌ చుట్టుపక్కల జలాలలో చైనా దూకుడు కొనసాగుతూండటంతో చైనాకున్న ప్రాదేశిక, సాగర జలాల ఆకాంక్షలు ఆ ప్రాంతంలోని దేశాలకు తేటతెల్లమయ్యాయి. అభివృద్ధికి ఊతంగా నిలుస్తామనే సాకుతో రుణాలు, పెట్టుబడుల రూపంలో కొన్ని దేశాలలోకి చైనా ప్రవేశించి తర్వాత అక్కడ స్థావరాలు ఏర్పరుచుకుని మాటువేయడం, వనరులను చేజిక్కించుకునే ప్రయత్నం చేయడంతో ప్రపంచంలోని పేద దేశాలు అది మేకవన్నె పులిలా వ్యవహరిస్తోందని తెలుసుకున్నాయి. సాంకేతిక, సైనిక, ఆర్థిక రంగాల్లో చైనా ముందడుగు వేయడంతో అది తనకు ‘సమ–స్థాయి పోటీదారు’గా అవతరించిందని అమెరికా ఉలిక్కిపడింది. 

2025తో మారిన పరిస్థితి
ట్రంప్, బైడెన్‌లతోపాటు కొందరు ఇండో–పసిఫిక్‌ నాయకులు చైనాకు ముకుతాడు వేయక తప్పదని నిర్ణయానికి వచ్చారు. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి అడ్డుకట్ట వేసేందుకు అమెరికా కొత్త కూటమిలను నిర్మించడం మొదలెట్టింది. అమెరికా వ్యూహాత్మక, రక్షణ అవసరాలను వ్యాపార అవకాశాలతో ముడివేసింది. అంతవరకు నిర్లక్ష్యం చేస్తూ వచ్చిన పసిఫిక్‌ దీవుల వంటి ప్రాంతాలకు అది తన అభివృద్ధి, వాతావరణ, భద్రతా అడుగుజాడలను విస్తరింపజేసింది. 

సరిగ్గా అదే సమయంలో, చైనా ఆంతరంగిక బలహీనతలు మరింత ప్రస్ఫుటమయ్యాయి. కోవిడ్‌–19 సందర్భంగా, బీజింగ్‌ చేపట్టిన అణచివేత చర్యలు ఎదురుతన్నాయి. స్థిరాస్తులు, మౌలిక సదుపాయాల రంగాలు సృష్టించిన విజృంభణ గాలి బుడగలా పేలి సంక్షోభానికి కారణమైంది. మితిమీరిన ఉత్పత్తితో పోల్చి చూస్తే దేశీయ వినిమయం సన్నగిల్లింది. సాపేక్షంగా చూస్తే ఈ ప్రాంతంలో దానికి మిత్రదేశాలు ఏవీ లేనట్లు కనిపించింది. చైనాతో ఎడమొహం పెడమొహంగా వ్యవహరించే అంతర్జాతీయ ధోరణి 2020 నుంచి 2024 వరకు కొనసాగింది. కానీ చైనాతో చెలిమి చేయాలని మళ్ళీ ప్రతి దేశం కోరుకుంటున్న స్థితికి 2025 అంకురార్పణ చేసినట్లుగా కనిపిస్తోంది. 

ఎందుకంటే, ఐరోపా–అట్లాంటిక్‌ మధ్య, ఇండో–పసిఫిక్‌ మధ్య సంబంధాలను పటిష్టపరిచే ప్రయత్నం చతికిలపడింది. రష్యా–చైనా మరింత కలసిగట్టుగా పనిచేస్తున్నాయి. ‘నాటో’, ఇండో–పసిఫిక్‌ మిత్ర దేశాల మధ్య వ్యత్యాసాన్ని తగ్గించేందుకు అమెరికా చేస్తున్నది ఏమీ లేదు. ఎవరి రక్షణను వారు సమాంతరంగా  పెంపొందించుకోవాల్సిందిగా అది రెండింటిపైన ఒత్తిడి తెస్తోంది. అందుకే ద హేగ్‌ ‘నాటో’ శిఖరాగ్ర సదస్సుకు దూరంగా ఉండాలని ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్‌ నిర్ణయించుకున్నాయి. 

చైనాతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఐరోపా దేశాలు సమష్టిగానూ, విడివిడిగానూ కూడా కోరుకుంటున్నాయి. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందో తెలియని అమెరికా వైపు మొగ్గేకన్నా, చైనాతో సన్నిహిత కార్యనిర్వాహక సంబంధాలను నెలకొల్పుకోవడమే మేలని ఐరోపాలోని అనేక మందికి అనిపిస్తోంది. సాక్షాత్తూ అమెరికాయే చైనాతో ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నట్లుగా సంకేతాలు పంపిస్తోంది. ట్రంప్‌ ఒక అగ్రస్థాయి వ్యాపార ప్రతినిధి బృందంతో  చైనాను సందర్శించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వెలువడుతున్నాయి.

పొరుగు దేశాలూ అదే బాటలో...
భద్రతాపరంగా చైనాతో జపాన్‌కు ప్రాథమికంగానే వైరుధ్యం ఉంది. దానికి తోడు టోక్యోకు పరిస్థితులను ట్రంప్‌ మరింత విషమంగా మార్చారు. అమెరికాతో మంత్రిత్వ స్థాయి చర్చలను జపాన్‌ రద్దు చేసుకుంది. మోటారు వాహనాల సుంకాలపై అది అమెరికాతో బాహాటంగానే తగవు పడుతోంది. దక్షిణ కొరియాలో ఇంతకుముందరి ప్రభుత్వం అమెరికాకు అనుకూలంగా ఉండేది. ప్రస్తుత నూతన ప్రభుత్వం విదేశాంగ విధానంలో మరింత సమతూకంతో కూడిన దృక్పథాన్ని ప్రదర్శిస్తోంది. ‘ఆకస్‌’ ఒడంబడికను సమీక్షించాలనే పెంటగాన్‌ అభిప్రాయం ఆస్ట్రేలియాను అస్థిమితానికి గురి చేసింది. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ను ట్రంప్‌ ఇంతవరకూ కలుసుకోలేదు. 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌ సైనిక ప్రతిస్పందన వెనుకనున్న శక్తి చైనాయే అయినప్పటికీ, చైనాతో సరిహద్దు సమస్యలు ఉన్నప్పటికీ, చైనాతో సయోధ్యకు వెనుకాడబోమనే సంకేతాలను భారత్‌ బహిరంగంగానే పంపుతోంది. చైనాతో తేల్చుకోవాల్సిన అంశాలు భారత్‌కు చాలానే ఉన్నాయి. వస్తూత్పత్తి రంగంలో చైనా ప్రాబల్యం వల్ల వాణిజ్యపరంగా చాలా అసమతౌల్యం ఉంది. దక్షిణాసియాలో భారతదేశానికి వ్యతిరేకంగా పావులు కదపడంలో బీజింగ్‌ బిజీగా ఉంది. కానీ తాను మధ్యవర్తిత్వం నెరపడం వల్లనే భారత్‌–పాక్‌ ఇటీవల యుద్ధాన్ని విరమించాయనే ట్రంప్‌ అసత్య వచనాలతో అమెరికాతో న్యూఢిల్లీకి రాజకీయపరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వాణిజ్యంపై చర్చలు కూడా పూర్తిగా ఒక కొలిక్కి రాలేదు. ఇవన్నీ చైనాకు సంతోషం కలిగించేవే. 

గత నాలుగేళ్ళలో, చైనా కుప్పకూలేంత స్థితికి వెళ్ళలేదు. దాన్ని ఏకాకినీ చేయలేకపోయారు. అలా అని చైనా ఇపుడు ప్రపంచంపై పెత్తనం చలాయించగల స్థితిలోనూ లేదు. కానీ, బీజింగ్‌కు అనుకూలంగా పరిస్థితులు పరిణమిస్తున్నాయి. దౌత్యపరంగా ఉన్న ఈ ప్రతికూల వాతావరణాన్ని లెక్కలోకి తీసుకుంటూ విశ్వసనీయమైన, పటిష్టమైన ఎజెండాను రూపొందించే సవాల్‌ను ‘క్వాడ్‌’ తదుపరి అధ్యక్ష హోదాలోకి వచ్చే భారత్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

-వ్యాసకర్త జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు(‘ది హిందుస్థాన్‌ టైమ్స్‌’ సౌజన్యంతో)
-ప్రశాంత్‌ ఝా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement