
ఈ యాసంగిలోనూ దొడ్డు రకాల పైనే ఆసక్తి చూపించిన రైతులు.. సన్నాలకు బోనస్ ఉన్నా పెద్దగా పట్టించుకోని రైతులు
అధిక పెట్టుబడి వ్యయం, ఎక్కువ పంట కాలం దృష్ట్యా వెనుకంజ
మొత్తం వరి సాగు విస్తీర్ణంలో 65 శాతం దొడ్డు రకాలే
ఇప్పటివరకు 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
ఇందులో 37.50 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకాలే..
సన్న ధాన్యం కేవలం 18.47 లక్షల మెట్రిక్ టన్నులే
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఈ యాసంగిలోనూ రైతులు వరి సాగు విషయంలో దొడ్డు రకాల వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. సన్న రకాలకు ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.500ల బోనస్ ప్రకటించినప్పటికీ..ఎప్పటిలా దొడ్డు రకాల కంటే తక్కువే సాగయ్యాయి. ఈ యాసంగిలో తెలంగాణ వ్యాప్తంగా 63,54,286 ఎకరాల్లో వివిధ పంటలు వేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా పంట విస్తీర్ణం ఏకంగా 79,99,834 (126 శాతం) ఎకరాలకు పెరిగింది.
వరి 47,27,000 ఎకరాల్లో సాగవుతుందని అనుకుంటే.. ఏకంగా 59.86 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఇందులో 65 శాతానికి పైగా దొడ్డురకాలే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతంతో పోల్చుకుంటే సన్నాల సాగు పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి.
కొనుగోలు కేంద్రాలకూ ఎక్కువగా దొడ్డురకాలే..
వరి సాగు విస్తీర్ణం పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం యాసంగిలో 71,03,283 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ 8,412 కొనుగోలు కేంద్రాలను ప్రతిపాదించినా.. చివరకు 8,353 కేంద్రాలను తెరిచింది. వీటి ద్వారా ఈ నెల 20వ తేదీ నాటికి 55.97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. ఇందులో 37.50 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలు కాగా, సన్న రకం కేవలం 18.47 లక్షల మెట్రిక్ టన్నులే కావడం గమనార్హం.
సన్నాలకు ఎన్ని సమస్యలో..
సన్న రకం వడ్ల సాగుకు పెట్టుబడి ఎక్కువ అవుతుంది. నీటి వసతి ఎక్కువగా ఉండాలి. చీడపీడల బెడద అధికం. పంట కాలం సైతం నెల రోజులు ఎక్కువగా ఉంటుంది. అకాల వర్షాలతో నష్టపోయే అవకాశం ఉంటుంది. పైగా యాసంగిలో వాతావరణం దృష్ట్యా దిగుబడి తక్కువగా వస్తుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న సన్న రకాల విత్తనాలను చూస్తే.. తెలంగాణ సోనా ఎకరాకు 20 నుంచి 23 క్వింటాళ్లు, బీపీటీ 20 క్వింటాళ్ల వరకు, జై శ్రీరాం 18 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అదే దొడ్డు రకం వరి అయితే 5 నుంచి 8 క్వింటాళ్ల వరకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే దొడ్డు సాగువైపు మొగ్గు చూపామని వివరిస్తున్నారు.
యాసంగి సాగు, కొనుగోళ్ల లెక్కలివీ..
71,03,283 మెట్రిక్ టన్నులు
యాసంగి 2024–25 ధాన్యం కొనుగోలు లక్ష్యం..
55.97 లక్షల మె.టన్నులు
ఇప్పటి వరకు కొనుగోలు చేసినవి (20.05.2025)
37.50 లక్షల మె.టన్నులు
ఇందులో దొడ్డు రకం ధాన్యం
18.47 లక్షల మె.టన్నులు
సన్న రకం ధాన్యం
8,412
ప్రతిపాదించిన కొనుగోలు కేంద్రాలు
8,353
ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలు
రూ.12,974.10 కోట్లు
కొనుగోలు చేసిన ధాన్యం విలువ
రూ.9,632.66 కోట్లు
ఎంపీఎంఎస్ ద్వారా చేసిన చెల్లింపులు
ఎక్కువ దిగుబడి కోసమే దొడ్డు రకం..
సన్న రకం అయితే పంట కాలం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతోనే దొడ్డు రకం వేసిన. పైగా దొడ్డు రకంతో ఎక్కువ దిగుబడి వస్తుంది. అందుకే తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడి వచ్చే దొడ్డు రకం (1010) సాగు చేశా. సన్నాలకు బోనస్ ఉన్నా.. దిగుబడి తగ్గితే లాభం ఉండదని అనుకున్నం. – కొండమీది భిక్షపతి, కమలాపూర్, హనుమకొండ జిల్లా
సాగు నిబంధనలు ఏమీ లేవు..
వరి విషయంలో రైతులు పలాన రకాలే సాగు చేయాలనే నిబంధనలు ఏమీ లేవు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో తీరుగా రైతులు తమకు నచి్చన వెరైటీలను వేసుకున్నారు. వ్యవసాయశాఖ తరఫున పంటల సాగుకు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేశాం. తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో దొడ్డురకాలే నయమన్న ధోరణితో చాలామంది అటువైపు మొగ్గు చూపినట్లు ఉంది. – కేతిరి దామోదర్‌రెడ్డి, ఏడీఏ, వరంగల్ జిల్లా